Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టబోయే దీక్షకు మద్దతుగా స్పీకర్ సైకిల్ యాత్ర చేపట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తన ఇంటి నుంచి కోటప్పకొండకు సైకిల్ పై బయలుదేరారు. మార్గమధ్యంలో నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. అలా సైకిల్ యాత్ర దిగ్విజయంగా సాగుతుండగా… యలమంద వద్ద ఓ ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి స్పీకర్ సైకిల్ ను ఢీకొట్టాడు. దీంతో కోడెల కిందపడిపోయారు. పక్కనే ఉన్న నేతలంతా ఆయన్ను వెంటనే పైకి లేపి సపర్యలు చేశారు.ఈ ఘటనలో స్పీకర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
కొద్దిసేపు సేదతీరిన అనంతరం స్పీకర్ తన సైకిల్ యాత్రను తిరిగి కొనసాగించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఒకరోజు నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా నియోజకవర్గాల్లో ఎమ్యెల్యేలు సామూహికదీక్షలు చేయనున్నారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సైకిల్ యాత్రలు సాగనున్నాయి. పదిహేను నుంచి ఇరవైరోజుల పాటు సాగే యాత్రల్లో ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో సాధించిన విజయాల గురించి వివరించనున్నారు.