లోక్ స‌భ‌లో ఇవాళా అదే తంతు…రేప‌టికివాయిదా

Parliament Postponed again

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస‌తీర్మానాలపై ఇవాళ కూడా లోక్ స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. రోజూ క‌థే మంగ‌ళ‌వారం కూడా పున‌రావృతం అయింది. ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌కుండానే రేప‌టికి వాయిదా ప‌డింది. ఈ ఉద‌యం స‌భ ప్రారంభం కాగానే… కావేరీ బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకె స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ తొలుత స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. అనంత‌రం స‌భ తిరిగి ప్రారంభం కాగానే… అన్నాడీఎంకె ఎంపీలు ఆందోళ‌నలు కొన‌సాగించారు. ఈ గంద‌ర‌గోళం మ‌ధ్యే సోమ‌వారం జ‌రిగిన భార‌త్ బంద్ పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేశారు. ద‌ళితుల కోసం త‌మ ప్ర‌భుత్వం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతోందని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టాన్ని నిర్వీర్యం చేసే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేద‌ని రాజ్ నాథ్ చెప్పారు. అనంత‌రం టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాల‌ను స్పీక‌ర్ చ‌దివి వినిపించారు.

అయితే స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో స‌భ్యుల‌ను లెక్కించ‌డం కుద‌ర‌ద‌ని ఆమె స్ప‌ష్టంచేశారు. స‌భ స‌జావుగా సాగితేనే చ‌ర్చ చేప‌ట్ట‌డం వీల‌వుతుంద‌ని అన్నారు. అవిశ్వాసంపై చ‌ర్చ‌ను చేప‌ట్టాల్సిఉంద‌ని, అంద‌రూ ప్ర‌శాంతంగా ఉండాల‌ని స్పీక‌ర్ ప‌లుమార్లు విన్న‌వించారు. అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ప‌లికే 50 మందిని లెక్కించేందుకు త‌న‌కు వీలుకావ‌డం లేద‌ని ఆమె అన్నారు. స్పీక‌ర్ ను ఉద్దేశించి 50 మంది కాదు 100మందిని లెక్కించుకోవ‌చ్చ‌ని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకె ఎంపీల గొడ‌వ‌ను సాకుగా చూపి, అవిశ్వాసంపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను స్పీక‌ర్ ప‌ట్టించుకోలేదు. ఈ స‌మ‌యంలో పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ స్పందించారు. స‌భ స‌జావుగా సాగితే అన్ని అంశాల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని స్ప‌ష్టంచేశారు. స్పీక‌ర్ కూడా మరోసారి విజ్ఞ‌ప్తిచేశారు. అయినప్ప‌టికీ అన్నాడీఎంకె స‌భ్యులు ప‌ట్టువీడ‌లేదు. దీంతో స‌భ ఆర్డ‌ర్ లో లేద‌ని స్పీక‌ర్ రేప‌టికి వాయిదా వేశారు.