దక్షిణాఫ్రికా గడ్డపై 31 ఏళ్లలో తొలిసారి టెస్టు సిరీస్ గెలవాలన్న టీమ్ఇండియా ఆశలకు గండి. బ్యాటుతో, బంతితో ఘోరంగా విఫలమైన ఆ జట్టు తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడో రోజు, గురువారం 256/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆలౌటైంది. యాన్సెన్ (84) చెలరేగిపోయాడు. ఓవర్నైట్ సెంచరీ హీరో ఎల్గర్ (185) మరిన్ని పరుగులు సాధించాడు. భారత బౌలర్లు మరోసారి తేలిపోయారు. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా పేస్కు తల్లడిల్లిపోయింది. బర్గర్ (4/33), యాన్సెన్ (3/36), రబాడ (2/32) ధాటికి 34.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్ప కూలింది. కోహ్లి (76) ఒక్కడే రాణించాడు. అతడు కాకుండా గిల్ (26) మాత్రమే రెండంకెల స్కోరు సాధించడం గమనార్హం. రెండో టెస్టు.. జనవరి 3న కేప్టౌన్లో ఆరంభమవుతుంది.
మరింత ఘోరంగా..: తొలి ఇన్నింగ్స్లో తీవ్రంగా తడబడ్డా, కేఎల్ రాహుల్ పుణ్యమా అని పరువు దక్కించుకున్న టీమ్ఇండియా.. రెండో ఇన్నింగ్స్లోనైనా పుంజుకుంటుందని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. మెరుగుపడడం సరికదా.. మరింత హీన ప్రదర్శనతో మరింతగా నిరాశపరిచింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్కు విలవిల్లాడిన టీమ్ఇండియా.. కనీస ప్రతిఘటన లేకుండా దాసోహమంది. కోహ్లి తప్ప ఎవరూ నిలవలేదు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచీ తడబాటే. ఆత్మ విశ్వాసమే కనపడలేదు. ఆటలో సాధికారతే లేదు. మంచి ఆరంభాన్నివ్వడంలో ఓపెనర్లు మరోసారి దారుణంగా విఫలమయ్యారు.