ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టులలో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ దారుణంగా విఫలమయ్యాడు. రిషభ్ పంత్ లోటును భర్తీ చేయలేక విమర్శల పాలవుతున్నాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో భారీ స్కోర్ చేయని భరత్.. స్వదేశంలో కూడా తేలిపోతున్నాడు. దాంతో, అతడిపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. సిరీస్‌లో కీలకమైన రాజ్‌కోట్ టెస్టులో భరత్ స్థానంలో యంగ్‌స్టర్ ధ్రువ్ జురెల్ ను ఆడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ లయన్స్‌పై 116 రన్స్ తో చెలరేగిన భరత్.. సీనియర్ జట్టుపై మాత్రం నిరాశ పరుస్తున్నాడు. అదే ధ్రువ్ జురెల్ మాత్రం గతేడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 15 మ్యాచుల్లో 790 రన్స్ చేశాడు. దాంతో, మూడో టెస్టులో జురెల్‌కు చాన్స్ ఇవ్వాలని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులలో ఇరుజట్లు చెరొక విజయం సాధించడంతో సిరీస్ 1-1 తో సమం అయింది.ఇక మూడో టెస్ట్ భారత్ ,ఇంగ్లాండ్ మధ్య ఈనెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.