కేవలం ఒక ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని.. దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అన్నారు. మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే సహచరుల నమ్మకం పొందగలమని తెలిపారు. మన పట్ల వ్యక్తుల్లో విధేయత గౌరవం ద్వారానే వస్తుందని వివరించారు.
“డ్రెస్సింగ్ రూంలో సహచరులు, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే విధేయతతో ఉండరు. మనం కేవలం మాటలు చెబితే సరిపోదు. ఏదైనా చేతల్లోనే చూపించాలి. మన ప్రవర్తనే మనకు గౌరవం తెచ్చిపెడుతుంది. మన కుర్చీ లేదా ర్యాంకు వల్ల గౌరవం వస్తుందని నేను భావించను. మనం ఎలా వ్యవహరిస్తామన్నదాన్ని బట్టే అది దక్కుతుంది. మొత్తంగా నేను చెప్పేదేమంటే.. గౌరవం దానంతట అది రాదు. మనం సంపాదించుకోవాలి. మనల్ని సహచరులు నమ్మితే మెరుగైన ప్రదర్శన దానంతట అదే వస్తుంది’’ అని ముంబయిలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ధోని చెప్పారు.