జూనియర్ హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో కొరియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు చేదు అనుభవం. గురువారం పూల్-సి రెండో మ్యాచ్‌లో ఉత్తమ్‌సింగ్ బృందం 1-4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో చిత్తయింది. పెనాల్టీకార్నర్లను గోల్స్ గా మలచడం లో విఫలం కావడం , బలహీనమైన డిఫెన్స్ భారత్‌ను దెబ్బ కొట్టాయి. ఈ మ్యా చ్లో ఆరంభంలోనే భారత్ కు షాక్ తగిలింది. తొలి నిమిషంలో కాబ్రె గోల్ చేసి స్పెయిన్ కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఆండ్రెస్ (18వ) బంతిని లక్ష్యానికి చేర్చడంతో స్పెయిన్ ఆధిక్యం రెట్టింపు అయింది.
ఈ మధ్యలో భారత్ కు పెనాల్టీకార్నర్లు దక్కినా నిష్ఫలమయ్యాయి. మూడో క్వార్టర్లో రోహిత్ (33వ) గోల్ చేయడంతో ఎట్టకేలకు భారత్ ఖాతా తెరిచింది. కానీ ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ కాబ్రె (41వ) మరో గోల్ సాధించి స్పెయిన్ కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. చివర్లో ఆండ్రెస్ (60వ) మరో గోల్ కొట్టి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. భారత్ (3 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. కొరియా కూడా ఇన్నే పాయింట్లు సాధించినా గోల్స్ అంతరంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. స్పెయిన్ (6) అగ్రస్థానంలో ఉంది.