భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆదివారం ఒక్క బంతి కూడా పడలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అసలు టాస్ వేయడమే సాధ్యం కాలేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కు సరైన కూర్పును గుర్తించే పక్రియ ఆరంభించాలనుకున్న టీమ్ఇండియాకు ఆట జరగకపోవడం నిరాశ కలిగించే విషయమే. భారత్ తో పాటు దక్షిణాఫ్రికాకు కూడా మెగా టోర్నీకి ముందు ఉన్న ఆరు మ్యాచ్ల్లో ఇదొకటి. ‘‘టీ20 ప్రపంచకప్ కన్నా ముందు మాకు చాలా తక్కువ అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్నాయని తెలుసు. అయితే ఐపీఎల్లో మేం 14 మ్యాచ్లు ఆడొచ్చు ’’ అని తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో జరిగిన విలేకర్ల సమావేశంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. కానీ అంతర్జాతీయ మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చే విశ్వాసం ఆటగాడికి మరేదీ ఇవ్వలేదనడంలో సందేహం లేదు. డర్బన్లో ఆట జరగకపోవడం రెండు జట్లతో పాటు అభిమానులకూ అసంతృప్తి కలిగించేదే. ఈ మ్యాచ్ టికెట్లన్నీ నెల కిందే అమ్ముడుపోవడం విశేషం. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో టీ20 మంగళవారం జరుగుతుంది. ఆ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. చివరి మ్యాచ్ గురువారం జరగనుంది.