Sports: పొట్టి కప్ను దక్కించుకోవాలంటే భారత్ తీవ్రంగా కష్టపడాలి: గంభీర్,యువరాజ్

Sports: India will have to work hard to win the short cup: Gambhir, Yuvraj
Sports: India will have to work hard to win the short cup: Gambhir, Yuvraj

వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన టీమ్ఇండియా ఆసీస్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మరో ఆరు నెలల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ రూపంలో మరో మెగా సమరం మొదలు కానుంది. వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్య మిస్తున్న పొట్టి కప్ను దక్కించుకోవాలంటే భారత్ తీవ్రంగా కష్టపడాల్సిందేనని మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. 2013 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీని టీమ్ఇండియా ముద్దాడలేకపోయింది. పలుమార్లు ఫైనల్కు చేరినా నిరాశ తప్ప లేదు. వచ్చే టీ20 ప్రపంచకప్లోనూ భారత్కు కఠిన సవాల్ తప్పదని మాజీలు పేర్కొన్నారు. ఓ క్రీడాఛానెల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో యువీ, గంభీర్ పాల్గొన్నారు. ‘టీ20 ప్రపంచకప్లో భారత్కు భారీ ముప్పు ఏ జట్టు నుంచి ఉంటుంది?’ అనే ప్రశ్నకు వారిద్దరూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

‘‘మూడు జట్ల నుంచి తీవ్ర పోటీ ఉంటుంది. అందులో అఫ్గానిస్థాన్ ఒకటి. యూఎస్ఏ పిచ్ పరిస్థితులు వారికి అనుకూలంగా ఉంటాయి. అందుకే అఫ్గాన్ అత్యంత ప్రమాదకరమైన టీమ్. ఇక ఆసీస్ ఎప్పుడూ డేంజరస్. కీలకమైన మ్యాచుల్లో ప్రభావం చూపించే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం . ఇంగ్లాండ్ కూడా తీవ్రమైన పోటీనిస్తుంది. టీ20 క్రికెట్ను ఆడే విధానం అద్భుతంగా ఉంటుంది’’ అని గంభీర్ అన్నారు.

‘‘గంభీర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. కానీ, నా దృష్టిలో మాత్రం దక్షిణాఫ్రికాకు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలవలేదు. ఇటీవల ఆ జట్టు ఆటతీరు అద్భుతంగా ఉంది. వన్డే ప్రపంచ కప్లో సఫారీ జట్టు ప్రదర్శనను చూశాం. పాకిస్థాన్ కూడా చాలా డేంజరస్ జట్టే’’ అని యువీ అభిప్రాయపడ్డాడు.

పాకిస్థాన్ పేరును యువీ ప్రస్తావించడంతో గంభీర్ స్పందించాడు. ‘‘పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. వన్డే ప్రపంచ కప్లో వారు ఓడిపోవడానికి ఇదీ ఓ కారణం . ఇటీవల అంతర్జాతీయ మ్యాచుల్లో ఆ జట్టు ఫీల్డింగ్ ప్రదర్శన నాసిరకమే. ఒకవేళ వారు టీ20 ప్రపంచకప్లో పోటీ ఇవ్వాలని భావిస్తే మాత్రం ఆ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు భారత్ ఫైనల్స్ కు చేరుకుంది. గత ఐదారేళ్ల వ్యవధిలో టీమ్ఇండియాలా పాకిస్థాన్ తుది పోరుకు అర్హత సాధించలేదు. భారత్ త్రుటిలో కప్లను చేజార్చుకుంది. ఈసారి మాత్రం టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంటుందనే ఆశాభావంతో ఉన్నా ’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.