ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 హంగామా ఇప్పటికే మొదలైంది. ఇటీవల బీసీసీఐ.. ఐపీఎల్ -2024 తొలి విడత షెడ్యూల్‌ను రిలీజ్ చేయగా తాజాగా ఈలీగ్ అఫిషీయల్ టెలివిజన్ పార్ట్నర్ స్టార్ స్పోర్ట్స్.. ప్రోమోను వదిలింది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యాలు నటించిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. 90 సెకన్ల నిడివి ఉన్న ఈ యాడ్‌తో స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ ప్రారంభంపై మరింత ఆసక్తిని పెంచింది.
యాడ్‌లో రిషభ్ పంత్ సిక్కు వేషధారణలో ఇటీవలే విడుదలైన యానియల్ చిత్రం స్టైల్లో ఎంట్రీ ఇచ్చి ఓ పంజాబీ డాబాలోకి వస్తాడు. గతేడాది ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై సిక్సర్ కొట్టి గెలిపించిన రవీంద్ర జడేజాను మహేంద్ర సింగ్ ధోని హత్తుకోవడం చూసి కన్నీరు కారుస్తాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ యాడ్‌లో గతేడాది గుజరాత్ పై రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన వీడియోను ఫ్యామిలీతో చూస్తూ కనిపించాడు.
గత సీజన్లో లక్నో ఆర్సీబీతో ఆడిన మ్యాచ్‌లో అంపైర్ తప్పిదం వల్ల మ్యాచ్ ఓడిపోవడాన్ని చూస్తూ లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫ్రస్ట్రేషన్లో బుక్ విసిరేయడం, అంపైర్‌పై అరిచినట్టు కనపించాడు.ఆఖర్లో వచ్చిన హార్ధిక్ పాండ్యా.. కంపెనీ సీఈవోగా జపాన్ ప్రతినిధులతో సమావేశం ముగియగానే టీవీలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదోసారి విజేతగా నిలిచిందని చెప్పడంతోనే సంబురాలు చేసుకుంటున్నట్టు చూపించారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.