ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (112) సెంచరీ చేయగా.. అరంగేట్ర బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్ (62), ధ్రువ్ జురెల్ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రవిచంద్రన్ అశ్విన్ (37), జస్ప్రీత్ బుమ్రా (26) విలువైన పరుగులు సాధించారు. యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పటీదార్ (5), కుల్దీప్ యాదవ్ (4) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లు మార్క్ వుడ్ 4, రెహాన్ అహ్మద్ 2.. అండర్సన్, టామ్ హార్ట్లీ, జోరూట్ తలో వికెట్ తీశారు.
ఓవర్‌నైట్ 326/5 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా తన స్కోరుకు రెండు పరుగులను మాత్రమే జోడించి పెవిలియన్ చేరాడు. జో రూట్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇవ్వడంతో జడ్డూ ఇన్నింగ్స్ కు తెరపడింది. కుల్దీప్ను అండర్సన్ ఔట్ చేశాడు. తొలి సెషన్లోనే భారత్ ఆలౌట్ అవుతుందేమోనని అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ, రవిచంద్రన్ అశ్విన్-ధ్రువ్ జురెల్ జోడీ ఇంగ్లాండ్ బౌలర్లను అడ్డుకుంది. ఎనిమిదో వికెట్‌కు వీరు 77 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. అరంగేట్ర టెస్టులో హాఫ్ సెంచరీ సాధిస్తాడని అనుకున్న సమయంలో ధ్రువ్ పెవిలియన్ బాట పట్టాడు. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో బుమ్రా దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లోనే మూడు ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. మహమ్మద్ సిరాజ్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో కాలికి బంతి తాకడంతో నొప్పితో బాధపడ్డాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ను.. భారత్‌కు పడిన పెనాల్టీతో 5/0 స్కోరుతో ప్రారంభించింది.