Sports: కొనసాగుతున్న టైటాన్స్ పరాజయాల పరంపర

Sports: Titans' losing streak continues
Sports: Titans' losing streak continues

ఆరంభంలో ఆధిపత్యం ప్రదర్శించడం .. గెలుపు ఆశలు రేకెత్తించడం.. చివరకు పేలవ ప్రదర్శనతో ఓటమి పాలవడం .. ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఆట ఇది. పాఠాలు నేర్వ లేకపోతున్న ఆ జట్టు వరుసగా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది. బుధవారం 36-38 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో టైటాన్స్ ఓడింది. మ్యాచ్ను దూకుడుగా ఆరంభించిన టైటాన్స్ 11 నిమిషాలకు 10-8తో ఆధిక్యంలో నిలిచింది. కానీ మళ్లీ పట్టు వదిలింది. నరేందర్ (10 పాయింట్లు) రాణించడంతో అవకాశాన్ని అందిపుచ్చుకున్న తలైవాస్ 12-12తో స్కోరు సమం చేసింది. అంతే కాకుండా 20-17తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

ద్వితీయార్థంలో కెప్టెన్ పవన్ (7) మెరవడంతో స్కోరును 20-20తో సమం చేసిన టైటాన్స్ పోటీలోకి వచ్చినట్లే కనిపించింది. అక్కడి నుంచి పోరు మరింత హోరాహోరీగా సాగింది. అజింక్య (4) రైడింగ్లో రెండు పాయింట్లు తేవడంతో 37వ నిమిషంలో తలైవాస్ 32-28తో నిలిచింది. కానీ టైటాన్స్ సూపర్ ట్యాకిల్ చేసి 31-32తో ప్రత్యర్థిని సమీపించింది. కానీ ఆఖరి నిమిషంలో ఆలౌటవడం టైటాన్స్ ను ఓటమి వైపు నిలిపింది. టైటాన్స్ జట్టులో రాబిన్ (7) కూడా ఆకట్టుకున్నాడు. తలైవాస్ తరపున సాహిల్ (7) ట్యాక్లింగ్లో అదరగొట్టాడు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 32-30తో జైపుర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. తొలి అర్ధభాగంలో 14-17తో వెనుకబడ్డ బెంగళూరు.. విరామం తర్వాత ఆల్రౌండ్ ప్రదర్శనతో పుంజుకుని విజేతగా నిలిచింది. ఆ జట్టులో వికాస్ (8), భరత్ (9), కెప్టెన్ సౌరభ్ (5) రాణించారు. జైపుర్ జట్టులో అజిత్ (9) మెరిశాడు.