మారాల్సింది సినీ ఇండస్ట్రీ కాదు… మగాడి మైండ్ సెట్

Sri Reddy Protest Tollywood Industry Casting Couch

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చిత్ర‌సీమ‌లో పైకి అంతా బాగున్న‌ట్టే ఉంటుంది, కానీ లోప‌లంతా డొల్ల‌. నిజాలు మాట్లాడుకునే ధైర్యం ఎవ్వ‌రూ చేయ‌రు, చేయ‌లేరు. ఇదీ గత కొంతకాలం క్రితం ఒక బడా నిర్మాత సినీ ఇండస్ట్రీ మీద చేసిన వ్యాఖ్య ఆయన వేరే సందర్భంలో అన్నా ఇప్పుడు శ్రీ రెడ్డి వ్యవహారం వల్ల సామాన్య ప్రజానీకం సినిమా ఇండస్ట్రీ అంటే ఇంతేనా అని అనుకునే పరిస్థితి. చాలా మంది భావిస్తున్నట్టు సినిమా అంటే ఒక కంపెనీనో, ఆర్గనైజేషనో కాదు సినిమా అంటే వ్యాపారం. కేవలం వ్యాపారం మాత్రమె ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టె నిర్మాత (పోనీ లక్షల్లోనే పెట్టాడనుకుందాం) తానూ పెట్టిన కోట్లకి ఇంకెన్ని కలిపి వస్తాయో అని ఆలోచిస్తాడు తప్ప తానొక మంచి సినిమా చేశానని ఇక ఈ లాభ నష్టాలతో పనిలేదని అనుకునేవారు ఎవరుంటారు ? నూటికో కోటికో ఒక్కరు తప్ప.

ఇప్పుడు ప్రధానంగా ఈ విషయం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే శ్రీ రెడ్డి అనే ఒక తెలుగు నటి, హీరొయిన్ గురించి. ఆమె లేవనెత్తిన అంశాలు, ఆమె చేస్తున్న పోరాటం జెన్యూనే కానీ ఆమె ఈ పోరాటం ఏ పరిస్థితుల్లో స్టార్ట్ చేసింది ? ఒక నెల క్రితం వరకు తెలుగు ప్రేక్షకుల్లో పావు వంతు మందికి కూడా తెలియని ఆమె, కేవలం వ్యూస్ కోసం ఏమైనా అడగచ్చు, ఏమైనా చేయచ్చు అని భావించే ఒక యుట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యు ఇచ్చింది. అందులో యాంకర్ వేసిన ఒక చెత్త ప్రశ్న (ఇండస్ట్రీ లో అవకాశాల కోసం మీరు…..) వల్ల ఆమె ఈ పోరాటానికి దిగింది. ఆ  ప్రశ్న విన్నాక ఆమెలో అంతర్యుద్దమే జరిగిందో, జ్ఞానోదయమే అయ్యిందో కాని మొత్తం ఇండస్ట్రీలో ఉన్న తెలుగు మహిళల తరపున వకాల్తా పుచ్చుకుని పోరాటం మొదలు పెట్టారు ఆమె.

ఆమె కోరుతున్న అంశాల్లో మొదటిది ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ రూపుమాపేలా చూడాలి అని, అది ఏనాటికీ జరగని పని కొన్ని లాజిక్స్ ప్రకారం ఆలోచిస్తే అర్ధం అవుతుంది. ఎందుకంటే మార్పు రావాల్సింది ఇండస్ట్రీ లో కాదు మగాడి మైండ్ సెట్ లో మగాడు ఆడదాన్ని “శృంగారానికి మాత్రమే పనికొచ్చే వస్తువు”లా చూసే విధానం మారనంత వరకూ ఈ సో కాల్డ్ క్యాస్టింగ్ ‘కౌచ్’ జాఢ్యం అనేది సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు బయట ప్రపంచాన్ని అయినా వదిలి పోదు. ఆమె పోరాటం వల్ల నిన్న ‘మా’ దిగివచ్చి ఒక క్యాష్ కమిటీ ని ఏర్పాటు చేసి ఉండచ్చు, కాని ఒక సమస్య తలెత్తి ఒక ఆడపిల్ల ఆ కమిటీ ముందుకు వెళ్ళినా ఆ ఆడపిల్లని అడిగే మొదటి  ప్రశ్న ఆధారాలు ఏవి ? అని…

మీరింత పకడ్బందీగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు స్త్రీ శరీరాన్నే కావాలనుకునే ఏ వెధవయినా ఇప్పటి దాకా ఫోన్లలో అడిగిన వాళ్ళు ఇక మీదట డైరెక్ట్ గానే అడుగుతారు. అప్పుడు ఎక్కడ నుండి తెస్తారు ఆధారాలు ? అందుకే మీడియా ఛానెల్స్ కి కొన్ని యు ట్యూబ్ ఛానెల్స్ కి ఒక విన్నపం ఏమిటంటే దయచేసి… ఫిలిమ్ నగర్లో అడుగుపెట్టాలంటే భయపడే స్థాయికి భవిష్యత్ తరాల మెదళ్ళలోకి ఈ చండాలాన్ని జొప్పించకండి. సినిమా అనేది ఒక కళాఖండం కొన్ని వందల మంది అహోరాత్రాలు కష్టపడి పనిచేస్తేనే కొన్ని వేల మంది తమ ఉపసమనం కోసం చూస్తారు. కాని సినిమా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

ఇది ఎవరు కాదనలేని సత్యం. కోట్ల మందికి అన్నం పెడుతున్న చిత్ర పరిశ్రమను గురించి తప్పుడు స్టేట్ మెంట్స్ ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే ప్రతి రంగంలోనూ మంచి ఉంది చెడు ఉంది. చిత్ర సీమ అంటేనే సెక్స్ సీమ అనే విధంగా ప్రాపగాండా చేయడం వల్ల మీకేమొస్తుంది. ఇవాళ చిత్ర సీమ లో జరిగే నెగటివ్స్ చూపించే మీకు చిత్ర సీమ కి చెందిన నటులు చేసే సేవా కార్యక్రమాలు కనపడవా ? చిత్ర సీమలో ‘కౌచ్’ దరిద్రం ఉంది కాదనట్లేదు. కాని సినిమా అంటేనే కౌచ్ కాదు. ఇంకో విషయం ఏంటంటే తెలుగు సినిమాల్లో తెలుగువారిని ఎంకరేజ్ చేయాలనే ఆలోచన బాగుంది, చాలా మంచి ఆలోచన కానీ ఆచరణ అసాధ్యం. ఎందుకంటారా కోట్ల రూపాయల పెట్టుబడితో తెరకెక్కే సినిమాలో హీరో, హీరోయిన్ మొదలుకొని సపోర్టింగ్ క్యారెక్టర్, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ , చివరకి ఐటెం సాంగ్ అయిన కూడా అన్నీ సినిమా బిజినెస్ ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేస్తారు, కౌచ్ ని దృష్టిలో పెట్టుకుని కాదు.

వేరే భాష వాళ్ళు తెలుగు సినిమాలో ఎందుకు అని వాదిస్తున్నారు. కానీ అదే వేరే భాష హీరోయిన్ వల్ల ఆ సినిమా ని వారి వారి భాషలలో (హిందీనో, తమిళో, మలయాళమో) ఆ సినీ నిర్మాతకు “డబ్బింగ్ రైట్స్” వల్ల మరింత డబ్బు వస్తుంది అనే ఎంతమందికి తెలుసు ? అందుకే మీదగ్గర టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీకి రండి, వచ్చాక ఎన్ని కష్టాలు పడాలో తెలుసుకుని అన్నిటికి సిద్దపది రండి. ఇక్కడ టాలెంట్ ఉంటేనే అవకాశాలు, అంతేగాని తెలుగు వాళ్ళు అయితే అవకాశాలు వచ్చి పడవు. మీదగ్గర టాలెంట్ ఉందా ఇండస్ట్రీ మిమ్మల్ని వదులుకోదు.