శ్రీదేవి కేసు క్లోజ్… శ్రీదేవి డెడ్‌ బాడీ అప్పగింత

Sridevi Case Closed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ్రీదేవి కేసును దుబాయ్ పోలీసులు క్లోజ్ చేశారు. అనేకానేక మ‌లుపులు తిరిగిన ఈ కేసులో ఎలాంటి కుట్రాలేద‌ని దుబాయ్ ప‌బ్లిక్ ప్రాసిక్యూష‌న్ అధికారులు తేల్చారు. ఆమె స్పృహ కోల్పోయి ప్ర‌మాద‌వశాత్తూ బాత్ ట‌బ్ లో ప‌డి… ఊపిరాడ‌క చ‌నిపోయార‌న్న దుబాయ్ ఫోరెన్సిక్ నివేదికతో ఏకీభ‌విస్తున్న‌ట్టు తెలిపారు. దీంతో ఈ కేసును క్లోజ్ చేస్తున్నామ‌ని… ఇలాంటి కేసుల్లో అనుస‌రించాల్సిన అన్ని ప్ర‌క్రియ‌లు పూర్తిచేశామ‌ని ప్ర‌క‌టించారు. తాజా క్లియ‌రెన్స్ నేప‌థ్యంలో బోనీక‌పూర్ కు దుబాయ్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. సోమ‌వారం ఫోరెన్సిక్ నివేదిక త‌ర్వాత దుబాయ్ పోలీసులు శ్రీదేవి ఆక‌స్మిక‌మ‌ర‌ణం కేసు ద‌ర్యాప్తును పబ్లిక్ ప్రాసిక్యూష‌న్ కు అప్ప‌గించారు. వారు బోనీక‌పూర్ ను ప‌లు ద‌ఫాలుగా విచారించిన‌ట్టు, ఆయ‌న పాస్ పోర్టు సీజ్ చేసిన‌ట్టు… ద‌ర్యాప్తు పూర్త‌య్యేదాకా… దుబాయ్ వీడొద్ద‌ని ఆదేశించిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు శ్రీదేవి మ‌ర‌ణంలో కుట్ర‌కోణం ఉందా అన్న అనుమానాలు రేకెత్తించాయి.

డెత్ స‌ర్టిఫికెట్ జారీ త‌ర్వాత కూడా మృత‌దేహాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించేందుకు ప్రాసిక్యూష‌న్ అధికారులు నిరాక‌రించ‌డంతో శ్రీదేవి మ‌ర‌ణం వెన‌క ఏవో బ‌ల‌మైన కార‌ణాలున్నాన్న ప్ర‌చారం జ‌రిగింది.ప్రాసిక్యూష‌న్ అధికారులు లేవ‌నెత్తిన సందేహాల‌తో అస‌లు ఆమె భౌతిక‌కాయం భార‌త్ కు ఎప్పుడు తీసుకువ‌స్తార‌నేదానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. అయితే ఈ ఉద‌యం త‌ర్వాత ప‌రిణామాలు నాట‌కీయంగా మారిపోయాయి. మ‌ధ్యాహ్నం త‌రువాత శ్రీదేవి భౌతిక కాయాన్ని త‌మ ఆధీనంలోనుంచి విడుద‌ల చేసేందుకు అనుమ‌తిస్తూ పోలీసులు దుబాయ్ లోని భారత రాయ‌బార కార్యాలయానికి, ఆమె భ‌ర్త బోనీక‌పూర్ కు లేఖ‌లు అందించారు. అనంత‌రం శ్రీదేవి భౌతిక‌కాయానికి ఎంబామింగ్ పూర్తిచేశారు. భార‌త కాల‌మాన ప్రకారం ఈ రాత్రి 11గంట‌ల‌కు ఆమె భౌతిక‌కాయం స్వ‌దేశానికి చేరుకునే అవ‌కాశం ఉంది. తొలుత శ్రీదేవి ఇంటికి మృత‌దేహాన్ని త‌ర‌లిస్తారు. అనంత‌రం అభిమానుల సంద‌ర్శ‌నార్థం మ‌హ‌బూబ్ స్టూడియోలో ఉంచుతారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.