రాజమౌళి టైం చూసి బుద్ధి చెప్పాడు.

SS-rajamouli-direct-to-mult

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్లో రాజమౌళి మల్టి స్టారర్. ఇందులో నిజం ఎంతో గానీ ఆ ఊహే తెలుగు ప్రేక్షకులకు భలే కిక్ ఇస్తోంది. అందుకే ఎప్పుడైతే రాజమౌళి ఆ ఇద్దరు హీరోలతో తాను కలిసి కూర్చున్న ఫోటో షేర్ చేసాడో అది వైరల్ అయిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కులాల ప్రభావం గురించి ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేసిన వారిలో రాజమౌళిది ముందు వరస. అలాంటి రాజమౌళి నందమూరి, మెగా క్యాంపు హీరోలతో ఓ సినిమా చేయడం అంటే పెద్ద ధైర్యమే చేస్తున్నట్టు. నిజానికి ఈ ఆలోచనకు ఊపిరి పోసిన సదరు ఫోటో రాజమౌళి షేర్ చేసే సమయానికి చిత్ర పరిశ్రమలో నందుల గోల ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిందే.
director-rajamouli-next-mov
నంది అవార్డుల ఎంపికలో లోటుపాట్లు వున్నాయన్న చర్చ, విమర్శలు కొత్త కాదు. ఒక్క నంది మాత్రమే కాదు. జాతీయ స్థాయి సినిమా అవార్డులు, పద్మ అవార్డులు వచ్చినప్పుడు సైతం ఇలాంటి వాదనలు తెరపైకి వస్తాయి. అయితే ఈసారి ఇంతకుముందు లేనంతగా కుల కోణం ముందుకు వచ్చింది. కులాల వారీగా విడిపోయి ఇటు మెగా క్యాంపు ని సమర్ధించే వాళ్లు, అటు నందమూరి క్యాంపు వెంట వుండే వాళ్ళు రెచ్చిపోయారు. ఇందులో తప్పెవరిది అని వెదికితే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరిన చందంగా ఉంటుంది. అలాగని వాళ్ళని అలా వదిలేస్తే కులాల కుంపట్లు అలా రగులుతూనే ఉంటాయి.
rajamouli
చిత్రసీమలో కులాల వారీగా కాకుండా ప్రతిభ విషయంలో ఆరోగ్యకరమైన పోటీ వుండాలని కోరుకునే వారిలో ముందుండే రాజమౌళి అదను చూసి తారక్, చరణ్ తో తాను కలిసి వున్న ఫోటో విడుదల చేశారు. అభిమానం, కులం అంటూ విద్వేషంలో రగిలిపోయే చాలా మందికి ఆ ఫోటో ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ప్రేక్షకుడు తెర మీద వినోదాన్ని కోరుకుంటాడు తప్ప కులాన్ని కాదు. రాజమౌళి నిజంగా ఆ ఇద్దరు హీరోలతో సినిమా తీసినా, తీయకపోయినా టైం చూసి బయటపెట్టిన ఫోటో రెండు వర్గాల మధ్య వేడి చల్లార్చడంలో ఎంతో ఉపయోగపడింది. అందరి దృష్టి కులాన్ని దాటి రాబోయే మల్టి స్టారర్ మీదకు వెళ్ళింది. దీంతో కులాల కట్టే రాజేసి చలి కాచుకుందామనుకున్న వారికి బ్రేక్ పడింది. ఎంతైనా ఈ విషయంలో కూడా రాజమౌళి బాహుబలి అనిపించాడు.