Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నవ్యాంధ్ర రాజధాని కోసం దర్శక ధీరుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావించడంపై అనేకమంది విమర్శనాస్త్రాలు సంధించారు. రాజధాని కట్టడానికి ఓ దర్శకుడి సలహా తీసుకోవడమేమిటని… మరిన్ని సినిమాలు చూసి మరింత మంది దర్శకుల సలహాలు పాటించాలని వ్యంగాస్త్రాలు విసిరారు. కానీ రాజమౌళి నవ్యాంధ్రలో నిర్మించబోయే అసెంబ్లీ కోసం అద్భుతమైన ప్రతిపాదన చేసి విమర్శకుల నోళ్లు మూయించారు. అత్యాధునిక హంగులతో ఏపీ ప్రభుత్వం నిర్మించబోయే అసెంబ్లీ భవనంలో తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి తన ప్రతిపాదనను విజువల్ రూపంలో సమర్పించారు రాజమౌళి. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అంగీకరించారని చెబుతూ ఆ విజువల్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో మొదటగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయాన్ని ప్రస్తావించారు. ఏడాదికి రెండు సార్లు ఆలయంలోని స్వామి వారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకే తీరును వివరించారు. అనంతరం గుడిమల్ల పరుశురామ ఆలయం, పుదుచ్చేరిలోని మాద్రి మందిర్ లో సూర్యకిరణాలు పడే విధానాన్ని కూడా వీడియోలో పొందుపరిచారు. అదే విధంగా నవ్యాంధ్ర అసెంబ్లీ భవనంలోని సెంట్రల్ హాల్ లో సూర్యకిరణాలు తాకేలా తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని రాజమౌళి ప్రతిపాదించారు. అసెంబ్లీ భవనంపై ఏర్పాటుచేసే అద్దాలపై సూర్యకిరణాలు పడి సరిగ్గా 9.15 నిమిషాలకు తెలుగుతల్లి విగ్రహం పాదాలను తాకుతాయని వీడియోలో వివరించారు. సూర్యకిరణాలు విగ్రహాన్ని తాకగానే మా తెలుగుతల్లికి మల్లెపూదండ పాటరావడం, విజువలైజేషన్ ఉన్న ఆ వీడియో ఆకట్టుకుంటోంది.