Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయ చదరంగంలో ప్రత్యర్థి పావుని ఎరగా వేసి రాజునో, మంత్రినో మింగేస్తాడన్న ఆలోచన లేకపోతే ఆట గెలవడం కష్టం . పైగా సొంత బలం తో గాకుండా వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లకి ఇంకా కష్టం. ఈ వ్యవహారంలో మాజీ సీఎం లకి కొడుకులైన జగన్, స్టాలిన్ లది చెరో స్టైల్.
ఆంధ్ర రాజకీయాల్లో పట్టు బిగించాలని భావించిన బీజేపీ ఓ వైపు టీడీపీ తో పొత్తు కొనసాగిస్తూనే ఇంకో వైపు జగన్ కి కన్ను గీటింది. ఆ పని వెనుక వున్న లక్ష్యం ఏమిటో అర్ధం చేసుకోకుండా ప్రధాని అపాయింట్ మెంట్ దొరకడమే ఘనకార్యంగా భావించిన జగన్ బీజేపీ కూడా ఊహించని స్థాయిలో ఆ పార్టీని వెనుకేసుకొచ్చారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఉన్నోళ్లు తప్ప ఇంకొకరు పోటీ చేయడమే తప్పన్నట్టు మాట్లాడారు. ఆ ఎన్నికల పని అవ్వగానే బీజేపీ జగన్ ని లైట్ తీసుకుంది. ఇక బీజేపీ విషయంలో జగన్ అత్యుత్సాహం చూసి వైసీపీ కి వీరాభిమానులైన కొన్ని వర్గాల ప్రజలు బాగా హర్ట్ అయ్యారు. ఇక నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత వైసీపీ ని బీజేపీ పట్టించుకోవడమే మానేసింది. కానీ జగన్ మీద పడ్డ బీజేపీ అనుకూల ముద్ర ఇంకా అలాగే వుంది. పైగా బీజేపీ మీద పెరుగుతున్న వ్యతిరేకత ని భరించాల్సిన మిత్రపక్షం టీడీపీ నుంచి జగన్ దాన్ని లాగేసుకున్నారు. జగన్ రాజకీయం ఇలా వుంది.
ఇక జయ మరణం తర్వాత తమిళనాట పాగా వేయాలని అన్నాడీఎంకే అంతర్గత కలహాల్లో వేలు పెట్టిన బీజేపీ ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో కొత్త ఐడియా తో ముందుకు వచ్చింది. ఐటీ రైడ్స్ తో అన్నాడీఎంకే ని పూర్తిగా భ్రష్టు పట్టించి డీఎంకే తో పొత్తు పెట్టుకోవాలి అనుకుంటోంది. అందుకే చెన్నై వచ్చిన ప్రధాని మోడీ కరుణానిధి ఇంటికి వచ్చారు. బీజేపీ మనసులో విషయాన్ని ప్రస్తుతం డీఎంకే పగ్గాలు పట్టుకున్న స్టాలిన్ బాగానే పసిగట్టారు. మోడీ ఇంటికి వచ్చాడన్న మర్యాదతో కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఓ ధర్నాని వాయిదా వేసుకున్నారు తప్ప ఇంకో అడుగు ముందుకు వేయలేదు. పైగా పార్టీ నేతలతో చర్చించినప్పుడు తమిళనాట జీఎస్టీ, నోట్ల రద్దు సహా వివిధ అంశాలపై బీజేపీ మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు గమనించారు. అందుకే పైకి నో చెప్పకుండా బీజేపీ ని వదిలించుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అవసరాలు తప్ప ప్రజల మనోభావాలు గుర్తించని జగన్ కన్నా స్టాలిన్ తెలివైనోడే అనిపిస్తోంది.