ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా సారథి విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌లు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరిలో ఎవరు గొప్పా అనే ప్రశ్న తలెత్తినప్పుడు సమాధానం చాలా కష్టమని ఎందుకంటే స్మిత్, కోహ్లిలు సమ ఉజ్జీలని క్రికెట్ పండితులు పేర్కొనడం విశేషం. ఆట పరంగా పోటీ ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకరికొకరు గౌరవంతో మెదులుతారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై తనకున్న గౌరవాన్ని మరోసారి బయటపెట్టాడు స్మిత్. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్మిత్ కోహ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘విరాట్ కోహ్లి అంటే నాకు చాలా గౌరవం. కోహ్లి గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పను. అతను అద్భుతమైన ఆటగాడు. అసాధారణ రికార్డులను సాధించాడు. భారత క్రికెట్ కోసం అతడు ఎంతో చేశాడు. ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న విధానం, విజయాల వెనుక విరాట్ కోహ్లి తపన ఎంతో దాగుంది. శారీరకంగా, మానసికంగా అతడెంతో బలంగా ఉంటాడు. తన ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకునే నిత్య విద్యార్థి అతడు. ఆటకే వన్నె తెచ్చిన క్రికెటర్ అతడు.
ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను ఛేజింగ్ చేసే విధానానికి నేను పెద్ద అభిమానిని. ఎంత ఒత్తిడిలో అయినా ప్రశాంతంగా ఉంటూ ఆడతాడు. ఈ విషయంలో కోహ్లి నుంచి యువక్రికెటర్లు చాలా నేర్చుకోవాలి’ అని స్మిత్ పేర్కొన్నాడు. ఇక వన్డేల్లో కోహ్లి, టెస్టుల్లో స్మిత్ నంబర్ వన్ ర్యాంకుల్లో కొనసాగుతున్న విషయం తెలసిందే. ఇక అన్నీ కుదిరితే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ అక్టోబరు 11, 14, 17 తేదీల్లో 3 టి20లు ఆడనుంది. అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో నాలుగు టెస్టులు, మూడు వన్డేల కోసం మరోసారి ఆసీస్ పర్యటనకు టీమిండియా వెళ్లే అవకాశం కూడా ఉంది.