Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళనా కార్యక్రమాల్లో ఎక్కవుగా పాల్గొనేది పురుషులే. మహిళలు కూడా ఇలాంటి ఆందోళనల్లో పాల్గొంటూ ఉంటారు కానీ పురుషులతో పోలిస్తే వారి శాతం చాలా తక్కువ. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఇదే పరిస్థితి. ఇక నిత్యం ఏదో ఒక ఆందోళన తలెత్తే కాశ్మీర్ లోయలో అయితే అమ్మాయిలు అసలు రోడ్ల మీదకు రారు. ఏ రకమైన ఆందోళనా కార్యక్రమంలోనూ వారు పాల్గొనరు. కానీ అలాంటి చోట ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ యువతి తన విశ్వరూపం చూపింది.
బ్లూ కలర్ చుడీదార్ వేసుకుని ముఖానికి చున్నీ ముసుగులాగా కట్టుకుని, వెనక నల్ల బ్యాగ్ తగిలించుకుని రెండు చేతులతో రాళ్లు పట్టుకుని బలంగా వాటిని విసురుతున్నట్టుగా ఉన్న ఆ యువతి ఫొటో జాతీయమీడియాలో సెన్సేషన్ గా మారింది. ఆ అమ్మాయి ఎవరన్న విషయం పెద్ద చర్చగా మారింది. కాశ్మీర్ లోయలో ఆమె మంచి ఫుట్ బాల్ క్రీడాకారిణి అని రాష్ట్రంలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలపై ఆగ్రహంతోనే ఆమె రాళ్లు రువ్వే ఆందోళనలో పాల్గొందని కథనాలు వచ్చాయి. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కాశ్మీర్ పర్యటనతో ఈ అమ్మాయి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఒకప్పుడు రాళ్లు రువ్విన ఆందోళనకారణిలా కనిపించిన ఆమె ఇప్పుడు కాశ్మీర్ ఫుట్ బాల్ మహిళల టీమ్ కెప్టెన్. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిఖ్. వయసు 21 ఏళ్లు. ఈ ఏడాది పోలీసులపై ఆమె రాళ్లు విసరడానికి కారణం స్థానిక పరిస్థితులే. ఏప్రిల్ లో కాశ్మీర్ లో అల్లర్లు జరిగాయి.
ఏప్రిల్ 24న అఫ్షాన్ తన స్నేహితురాళ్లతో కలిసి కోఠిబాగ్ వెళ్తుండగా ఆందోళనలు తలెత్తాయి. వాటితో అఫ్షాన్ బృందానికి ఎలాంటి సంబంధమూ లేదు. అయితే సంఘటన స్థలంలోనే వారు ఉండడంతో పోలీసులు ఆందోళనకారులపై ప్రయోగించినట్టుగానే వారిపైనా భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. అలాగే ఓ పోలీసు ఆమె బృందంలోని ఓ అమ్మాయిని కొట్టాడు. దీంతో అఫ్షానా ఎదురుతిరిగి పోలీసులపైకి రాళ్లురువ్వింది. ఆమె ఫొటో దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్వయంగా ఆమెను కలిశారు. ఆమె ఆకాంక్షలను అడిగి తెలుసుకున్నారు. ఆమె కోరినట్టుగా రాష్ట్రంలో మహిళల ఫుట్ బాల్ ను ప్రమోట్ చేస్తామని హామీఇచ్చారు. తర్వాత అఫ్షానాకు రాష్ట్ర ఫుట్ బాల్ జట్టులో చోటు దొరికింది. ఆ తర్వాత కెప్టెన్ హోదానూ అందుకుంది. రాజ్ నాథ్ సింగ్ తన పర్యటనలో భాగంగా అఫ్షానా నేతృత్వంలోని ఫుట్ బాలు జట్టును కలవడంతో ఇప్పుడు మరోసారి ఆమె వార్త హాట్ టాపిక్ గా మారింది. తమ సమస్యలను కేంద్రం ఎంతో ఓపికతో విని మౌలిక వసతులు కల్పించడానికి ముందుకువచ్చిందని అఫ్సానా కృతజ్ఞతలు తెలియజేసింది.
రాజ్ నాథ్ సింగ్ తమ ముందే ముఖ్యమంత్రి ముఫ్తీతో మాట్లాడారని కోచింగ్ నుంచి అత్యాధునిక పరికరాల వరకూ ఏర్పాటుచేయాలని సూచించారని అప్షానా సంతోషం వ్యక్తంచేసింది. తన జీవితం ఇప్పుడు ఎంతో మారిందని, ఇక తాను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని ఆనందంగా చెప్పింది. దేశం గర్వపడే స్థాయికి ఎదగాలన్నది తన లక్ష్యమని తెలిపింది. కశ్మీర్ లోయలో ఎందరో ప్రతిభ కలిగిన యువతీ యువకులున్నారని, అయితే వారికి ఓ వేదిక కావాలని, అలాంటి వారికి ప్రభుత్వ అవకాశాలుకల్పిస్తే.. ఎన్నో విజయాలు సాధిస్తారని చెప్పింది. రాళ్లదాడిపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తంచేసింది. పోలీసులపై రాళ్లు రువ్వినందుకు సిగ్గుగా ఉందని, తాను అలా చేయకుండా ఉండాల్సిందని, అయితే తన టీమ్ లోని ఓ అమ్మాయిని పోలీసు కొట్టడంవల్లే ఆ పని చేశానని తెలిపింది. ఓ సినిమాకు సరిపడా నాటకీయత ఉన్న ఆమె జీవితాన్ని కూడా తెరకెక్కించాలని బయోపిక్ ల బాలీవుడ్ భావిస్తోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అఫ్షాన్ జీవితాన్ని సినిమాగా రూపొందించాలని భావిస్తున్నారు.