ఉప్పల్ స్టేడియంలో తప్పిన పెను ముప్పు

నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం పెను నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులకు ఎన్టీఆర్ స్టేడియంలోని ఎగ్జిబిషన్ షెడ్, ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలాయి. ఫ్లడ్ లైట్ కూలిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానానికి నష్టం వాటిల్లింది. సౌత్ పెవిలియన్‌ బైలాక్‌ లోని షెడ్డు, భారీ ఎల్‌ఈడీ లైట్ కుప్పకూలాయి. పెవిలియన్‌లో 80 శాతం దెబ్బతిన్నట్టు స్టేడియం నిర్వాహకులు ప్రకటించారు. అయితే సోమవారం ఐపీఎల్ మ్యాచ్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఎల్బీ స్టేడియంలో ఫ్లెడ్ లైట్ కుప్పకూలిన సంగతి తెలిసిందే.