ఉత్తర్‌ప్రదేశ్‌లో వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీకి చెందిన యువతి(25) ఆగ్రాలోని ఓ మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతోంది. మంగళవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలిస్తుండగా బుధవారం ఉదయం కాలేజీ సమీపంలోనే విగతజీవిగా కనిపించింది. ఆమె మెడ, తలపై తీవ్రగాయాలు ఉండటంతో ఎవరో ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
జలౌన్ ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తమ కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతితో అతడికి సంబంధం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో యువతి మృతదేహం లభించిన ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసును త్వరలోనే చేధిస్తామని ఆగ్రా పోలీసులు తెలిపారు.