అమీర్ పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో హాస్టళ్లలో ఉండే వాళ్లకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇక్కడ కిక్కిరిసిన హాస్టళ్లలో కరోనా ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్న భయం మొదలైంది. దీంతో హాస్టళ్లు ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.
ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ.. పోలీస్ స్టేషన్లో అనుమతి పత్రం తీసుకుని తమ ఊర్లకు వెళ్లిపోవచ్చని ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కసారిగా వేల మంది రోడ్ల మీదికి వచ్చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ బయట పెద్ద ఎత్తున కుర్రాళ్లు గుమిగూడారు. అక్కడి నుంచి క్యూ మొదలుపెడితే కిలోమీటర్లు కిలోమీటర్లు జనం బారులు తీరారు. వీళ్లంతా ఒకరికొకరు అత్యంత సమీపంలో నిలబడ్డారు.
ఇలా వేల మంది ఒకచోట పోగవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రమాదమని తెలిసినా పోలీస్ స్టేషన్లో అనుమతి పత్రం నిబంధన ఎందుకు పెట్టారో ఏమిటో? ఈ షరతులేమీ లేకుండా పంపడమో.. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయడమో చేయాల్సింది. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన లేకుండా పెద్ద తప్పు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.