కడు పేదరికం నుంచి అపర కుబేరుడు

కడు పేదరికం నుంచి అపర కుబేరుడు

పుట్టి, పెరిగింది పక్కాపల్లెటూరిలో. ఏడాదిలోపే కన్నతల్లి చనిపోయింది. రిటైర్డ్‌ సోల్జర్‌ అయిన తండ్రి పచ్చి తాగుబోతు. అందుకే బిచ్చమెత్తుకుంటూ దయనీయమైన బతుకు బతికాడు ఆ కుర్రాడు. చినిగిన బట్టలు, వాటికి ప్యాచీలు. నాన్నమ్మ ఇంటి నుంచి బడికి కాలినడక. ఒక్కపూట తిండి. అదీ స్నేహితులు ఇచ్చిన బ్రెడ్డు.. స్వీట్‌పొటాటోలతో కడుపు నింపేసుకోవడం.. ఇలా చెప్తూ పోతే అతని బాల్యమంతా దరిద్రమే కనిపిస్తుంది. అలాంటోడు బిలీయనీర్‌గా.. కాదు కాదు మల్టీబిలీయనీర్‌గా ఎదిగిన క్రమం కచ్చితంగా ఒక అద్భుత విజయమే. కానీ..

పైన చెప్పిందంతా.. చైనా, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే టాప్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీగా గుర్తింపు పొందిన ‘ఎవర్‌గ్రాండ్‌’ వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్‌ జీవితం గురించి. కడు పేదరికం నుంచి అపర కుబేరుడిగా ఎదిగి.. ప్రపంచంలో గుర్తింపు దక్కించుకున్న ఒక కంపెనీకి అధిపతిగా పేరు సంపాదించుకున్నారాయన. కానీ, ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభంతో ఆయన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్ల క్రితం 43 బిలియన్‌ డాలర్లుగా ఉన్న హుయి కా యాన్‌ సంపద.. 8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. డిఫాల్టర్‌ దిశగా ఎవర్‌గ్రాండ్‌ అడుగులు పడుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఆయన ముందర ఉంది.

2017లో ఓ యూనివర్సిటీ ఈవెంట్‌లో క్జూ జియాయిన్‌ చేసిన ప్రసంగం గుర్తు చేసుకుంటూ.. చిన్నప్పుడు సరైన బట్టలు ఉండేవికావు. తిండి దొరికేది కాదు. దూరంగా వెళ్లిపోయి మంచి ఉద్యోగం.. కడుపునిండా తిండి తినాలని కలలు కనేవాడిని. ఇప్పుడా కల నెరవేరింది.చైనాలో రాజకీయ పరిణామాలతో.. 1976లో స్కూల్‌ చదువుకు గుడ్‌బై చెప్పేసి.. ఉద్యోగం దొరక్క బాగా ఇబ్బంది పడ్డాడు హుయి కా యాన్‌. సిమెంట్‌ ఫ్యాక్టరీలో కూలీగా పని చేస్తూ దొరికింది తింటూ డబ్బు కూడబెట్టుకున్నాడు. తిరిగి కాలేజీలో చేరి విద్యను కొనసాగించాడు. 1978లో వుహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌లో చదువుకున్నాడు.

శుభ్రత.. చిన్నతనంలో పేదరికంతో దేనికైతే అతను దూరంగా ఉన్నాడో.. ఆ విభాగానికే అతను లీడర్‌గా వ్యవహరించడం విశేషం.యూనివర్సిటీ చదువు పూర్తయ్యాక స్టీల్‌ కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా రెండేళ్లు, డైరెక్టర్‌గా ఏడేళ్లు పని చేశాడు. 1992లో గువాంగ్‌డాంగ్‌లోని షెంజన్‌ ‘స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌’గా మారింది. దీంతో అక్కడికి మకాం మార్చేసి.. ఓ స్టీల్‌ కంపెనీని మొదలుపెట్టాడు. 1997లో ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్‌ స్థాపన ద్వారా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి బీజం వేశాడు. 2020లో ఫోర్బ్స్‌ లిస్ట్‌లో సైతంనిలిచాడు. కానీ, 2017 నుంచి అప్పులతో పతనం అవుతున్న అతని సంపద గురించి గోపత్యను ప్రదర్శిస్తూ వస్తున్నాడు.

క్జూ జియాయిన్‌.. విలాసాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తాడు. 2010లో కష్టాల్లో ఉన్న గువాంగ్జౌ ఫుట్‌బాల్‌ టీంను కొనుగోలు చేశాడు. టీంను ఛాంపియన్‌గా ఎదిగేందుకు అవసరమైన ఖర్చు చేశాడు. అంతేకాదు 60 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి విలాసవంతమైన ఓ యాట్చ్‌ను సైతం మెయింటెన్‌ చేస్తున్నాడు. ఇదిగాక ప్రైవేట్‌ జెట్‌తో పాటు ఫ్రెంచ్‌ బ్రాండ్‌ ఉత్పత్తుల కోసం విపరీతంగా ఖర్చు పెడుతుంటాడు. కమ్యూనిస్ట్‌ పార్టీతో దగ్గరి సంబంధాలు ఉన్న క్జూ జియాయిన్‌.. తన జీవితాన్ని మార్చేసిన చదువు కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటాడు.

మిలియన్‌ డాలర్లను ఎడ్యుకేషన్‌ స్కీమ్‌ల కోసం దానం చేస్తుంటాడు. కానీ, ఆ ప్రభుత్వ నిర్ణయమే ఇప్పుడు ఆయన్ని కిందకు లాగేస్తోంది.అయితే.. దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలపై పట్టు సాధించడం కోసం డ్రాగన్‌ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ “సాధారణ శ్రేయస్సు” పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల చైనా బిలియనీర్ క్లాస్‌లో భారీ ఆటుపోట్లు సంభవిస్తున్నాయి. ఎవర్‌గ్రాండ్‌ తిరోగమనం తారాస్థాయి నుంచి మొదలైంది కూడా ఈ విధానం వల్లే.