దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతను వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్ కోసం భారత వన్డే జట్టు రేపు కేప్‌టౌన్ విమానం ఎక్కాల్సి ఉండగా సుందర్ కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది.
గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సుందర్.. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో రాణించి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా జనవరి 19న తొలి వన్డే, 21న రెండోది, జనవరి 23న మూడో వన్డే ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారధిగా వ్యవహరించనున్నాడు.