Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాకినాడ మేయర్ గా సుంకర పావని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కాకినాడ కార్పొరేషన్ పీఠం దక్కించుకున్న టీడీపీ… మేయర్ అభ్యర్థి ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలిచిన దగ్గరనుంచి మేయర్ పీఠం ఎవరికి కేటాయించాలనేదానిపై పార్టీలో విస్తృత చర్చలు జరిగాయి. దీనిపై చంద్రబాబు అనేకమంది నేతల అభిప్రాయాలు సేకరించారు. మంత్రులు, పార్టీ నేతలు మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికను చంద్రబాబుకే వదిలేశారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం చంద్రబాబు ఉన్నతవిద్యావంతురాలైన సుంకర పావనిని మేయర్గా, కాలా సత్తిబాబును డిప్యూటీ మేయర్ గా ఎంపిక చేశారు. ఈ ఎంపిక పూర్తిగా చంద్రబాబు మార్గదర్శకాలమేరకు జరిగిందని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి ప్రత్తాపాటి పుల్లారావు చెప్పారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికలో బీజేపీ కౌన్సిలర్లు, ఆ పార్టీ నేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. అనంతరం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో మేయర్, డిప్యూటీ మేయర్ బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ మేయర్ గా తనను ఎంపిక చేయటంపై సుంకర పావని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు అడుగజాడల్లో నడిచి కాకినాడను అభివృద్ధి చేస్తానని ఆమె చెప్పారు. 50 డివిజన్లు ఉన్న కాకినాడ కార్పొరేషన్ లో 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. అందులో టీడీపీ 39 చోట్ల పోటీచేసి 32 స్థానాల్లో గెలవగా..మిత్రపక్షం బీజేపీ 9 డివిజన్లలో పోటీచేసి మూడు చోట్ల గెలిచింది.