ప్రాణాంతక కోవిడ్-19 రెండో దశ ఉధృతి కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్‌డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అదే విధంగా పేషెంట్లకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కోవిడ్ పేషెంట్లను ఆస్పత్రిలో చేర్చుకునే విషయమై వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయని, ఇలా కాకుండా దేశ వ్యాప్తంగా ఒకేరకమైన విధానం రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకు రెండు వారాల గడువు విధిస్తున్నట్లు తెలిపింది. ఇక సామూహిక కార్యక్రమాలు, సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లపై నిషేధం విధించాలని, సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా త్వరితగతిన చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో లాక్‌డౌన్ విధించినట్లయితే వలస కార్మికులు సహా ఇతర బడుగు జీవులు ఇబ్బందులు పడకుండా వారి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 3.68 లక్షల కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 3 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి.