శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై నెలకొన్న వివాదాన్ని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు నివేదించింది. ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తీర్పు చెప్పింది. సీజే రంజన్ గొగోయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ముగ్గురు జడ్జిలు విస్తృత ధర్మాసనానికి ఈ వివాదాన్ని రిఫర్ చేయాలని తీర్పు చెప్పగా ఈ మెజారిటీ తీర్పుతో జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్ విభేదించారు. అయితే 2018 తీర్పుపై ఎలాంటి స్టే ఇవ్వలేదు సుప్రీంకోర్టు.
తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చదివి వినిపించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉందని ఆయన స్పష్టం చేశారు. మతంలో అంతర్గత విషయం ఏమిటనేది తేల్చడమే సుప్రీంకోర్టు ముందున్న అంశంగా తెలిపారు. ఈ అంతర్గత విషయాల్లో రాజ్యాంగ ధర్మాసనం ఎంత వరకూ జోక్యం చేసుకోవచ్చనేది కూడా పరిశీలించాలని అన్నారు సీజే.
శబరిమల అయ్యప్ప ఆలయంలోని అన్ని వయసుల మహిళల ప్రవేశానికి సంబంధించి గత ఏడాది సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై దాదాపు 65 వరకూ పిటిషన్లు దాఖలయ్యాయి. సుదీర్ఘ విచారణ తర్వాత ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ తీర్పు చెప్పింది. పార్సీ మహిళలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీజే. ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై ఒక సమగ్ర చట్టం ఉండాలని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు.
శబరిమల తీర్పుపై సమీక్షతోపాటు అనేక కొత్త పిటిషన్లు దాఖలైనట్లు సుప్రీం సీజే చెప్పారు. విస్తృత ధర్మాసనం తీర్పు చెప్పే వరకూ ఈ పిటిషన్లన్నీ పెండింగ్‌లోనే ఉంటాయి. కేవలం దేవాలయల్లోనే కాకుండా మసీదుల్లో మహిళల ప్రవేశంపై ఈ పిటిషన్ ప్రశ్నలు లేవనెత్తింది. మత సంబంధమైన ఈ కీలక అంశాలను విస్తృత ధర్మాసనానికి నివేదించడమే కరెక్ట్ అని ఈ బెంచ్ భావిస్తోంది.