Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా తీవ్రసంచలనంగా మారిన కథువా అత్యాచార ఘటనలో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. కథువా అత్యాచార బాధితురాలు ఆసిఫాబానో కుటుంబానికి, ఆ కుటుంబం తరపున ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది దీపిక ఎస్. రాజావత్ కు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ చిన్నారి ఆసిఫా తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. బాధితురాలి కుటుంబం తరపున వాదిస్తున్న దీపిక తనకు ప్రాణహాని ఉందని, తనను కూడా రేప్ చేసి చంపేందుకు కుట్ర జరుగుతోందని భయాందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలిచ్చింది.
మరోపక్క కథువా కేసులో నిందితులను చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ లో ప్రవేశపెట్టారు. నిందితులకు ఛార్జిషీట్ కాపీలను అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణ ఈ నెల 28వతేదీకి వాయిదావేశారు. అటు ఉన్నావ్, కథువా అత్యాచార బాధితులకు బాలీవుడ్ అండగా నిలిచింది. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ట్వింకిల్ ఖన్నా, సమీరారెడ్డి, రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ, హెలెన్, ఏక్తాకపూర్, అమైరా దస్తూర్, కల్కీ, అదితీరావు హైదరీ తదితరులు ముంబయిలోని కార్టర్ రోడ్డు వద్ద నిరసన వ్యక్తంచేశారు. వారితో వందలాదిమంది ప్రజలు జతకలిశారు. న్యాయం జరగాలి అంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.