కావేరీ జ‌లాల వివాదంలో త‌మిళ‌నాడుకు సుప్రీంకోర్టు షాక్

tamil nadu Supreme Court verdict on Cauvery water dispute

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

120 ఏళ్ల‌గా కొన‌సాగుతున్న కావేరీ జ‌లాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువ‌రించింది. త‌మిళ‌నాడుకు 177.25 టీఎంసీల నీటిని విడుద‌ల చేయాల‌ని క‌ర్నాట‌క ప్ర‌భుత్వాన్ని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. 2007లో కావేరీ జ‌ల‌వివాద ప‌రిష్కార ట్రిబ్యున‌ల్ ఆదేశాల‌తో పోలిస్తే సుప్రీంకోర్టు త‌క్కువ మొత్తం కేటాయించి త‌మిళ‌నాడుకు షాక్ ఇచ్చింది. ట్రిబ్యున‌ల్ త‌మిళ‌నాడుకు 192టీఎంసీలు విడుద‌ల చేయాల‌ని క‌ర్నాట‌కను ఆదేశించ‌గా…ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన సుప్రీం ధ‌ర్మాస‌నం 177.25 టీఎంసీల‌కు త‌గ్గించింది. సుప్రీంకోర్టు తీర్పుతో క‌ర్నాట‌క‌కు అద‌నంగా 14.75 టీఎంసీల నీరు మిగ‌ల‌నుంది. త‌న తీర్పులో సుప్రీంకోర్టు అనేక విష‌యాలు స్ప‌ష్ఠంచేసింది.

కావేరీ న‌దీ జ‌లాల‌పై ఏ ఒక్క రాష్ట్రానికీ సంపూర్ణ హ‌క్కులేద‌ని తేల్చింది. న‌దిలోని నీటిప‌రిమాణాన్ని అనుస‌రించి త‌మిళ‌నాడుకు ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేయాల‌ని క‌ర్నాట‌క‌ను ఆదేశించింది. కేర‌ళ‌, పుదుచ్చేరి వాటాల్లో ఎలాంటి మార్పూలేద‌ని తెలిపింది. క‌ర్నాట‌కలో పెరుగుతున్న అవ‌స‌రాల దృష్ట్యా 14.75 టీఎంసీలు వాడుకోవ‌చ్చ‌ని, 4.75 టీఎంసీలు బెంగ‌ళూరు న‌గ‌రవాసుల తాగునీటి అవ‌స‌రాల‌కు కేటాయిస్తున్నామ‌ని వివ‌రించింది. న‌దీజ‌లాలు జాతీయ‌సంప‌ద‌ని, తామిస్తున్న తీర్పు 15 సంవ‌త్స‌రాల పాటు అమ‌లులో ఉంటుంద‌ని, త‌ర్వాతి కాలంలో మారిన ప‌రిస్థితుల‌ను అనుస‌రించి, తీర్పు స‌మీక్షించాల‌ని రాష్ట్రాలు కోర‌వ‌చ్చ‌ని స్ప‌ష్టంచేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఆర్టీసీ బ‌స్సుల‌ను తాత్కాలికంగా నిలిపివేసి…చెక్ పోస్టుల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త ఏర్పాటుచేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో క‌ర్నాట‌క‌లో సంబ‌రాలు జ‌రుగుతుండ‌గా..త‌మిళ‌నాడులో నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయి. తీర్పుపై త‌మిళ నాడు అసంతృప్తి వ్య‌క్తంచేయ‌గా..క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య హ‌ర్షం వ్య‌క్తంచేశారు. క‌ర్నాట‌క అసెంబ్లీకి త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రానికి సానుకూలంగా తీర్పు ఇచ్చేలా కేంద్రం న్యాయ‌వ్య‌వ‌స్థపై ఒత్తిడి తెచ్చింద‌న్న విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఇది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మని ఆరోపిస్తూ విప‌క్షాలు ధ‌ర్నాకు దిగాయి. శాంతిభ‌ద్ర‌త‌ల‌పై డీజీపీతో ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి స‌మీక్ష నిర్వ‌హించారు. త‌మిళ‌నాడులోని క‌న్న‌డ పాఠ‌శాల‌లు, బ్యాంకులు, హోట‌ళ్ల‌కు భారీ భ‌ద్ర‌త క‌ల్పించారు.