Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఢిల్లీ టెస్టుపై కాలుష్యం పంజా విసురుతోంది. అత్యంత ప్రమాదకరంగా మారిన కాలుష్యాన్ని తట్టుకోలేక లంక క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తుండడంతో ఫీల్డింగ్ కోసం మైదానంలో ఉన్న లంకేయులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆదివారం రెండో రోజ ఆటలో ఓవర్ పూర్తిచేయలేక ఐదో బంతి వేసి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి వాంతిచేసుకున్న లక్మల్ నాలుగో రోజు ఆటలో మరింత ఇబ్బంది పడ్డాడు. స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న లక్మల్ మైదానంలోనే వాంతి చేసుకున్నాడు. దీంతో జట్టు ఫిజియో అతన్ని బయటకు తీసుకువెళ్లాడు. కొంత సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత లక్మల్ తిరిగి వచ్చాడు.
ఢిల్లీలో నాలుగురోజుల నుంచి కాలుష్యం తీవ్రత ఎక్కువగానే ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఇది 150 పైన ఉంటేనే అనారోగ్యకరమైనదిగా భావిస్తారు. అలాంటిది ఆదివారం గాలి నాణ్యతా సూచీపై ఆదివారం 338 చూపించగా… సోమవారం 400 దాటింది. అటు జాతీయ హరిత ట్రిబ్యునల్ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కాలుష్య స్థాయి ప్రమాదకర స్థితికి చేరుకున్నప్పటికీ… మ్యాచ్ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వంతో పాటు కార్పొరేషన్లు కాలుష్య నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. దీనిపై బీసీసీఐ స్పందించింది. ఇకపై ఢిల్లీలో చలికాలంలో మ్యాచ్ లు నిర్వహించే ముందు కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేసింది.
అటు ముఖానికి మాస్క్ లు కట్టుకుని ఆడడం, హఠాత్తుగా మైదానాన్ని వీడిపోవడం వంటివి చేస్తున్న లంక క్రికెటర్ల ప్రవర్తనపై మరో రకం వాదన వినపడుతోంది. నిజానికి లంకేయులు ఆడుతున్న మైదానంలోనే భారత క్రికెటర్లు ఎలాంటి మాస్కులూ లేకుండా, ఏ మాత్రం ఇబ్బంది పడకుండా… మ్యాచ్ ఆడుతున్నారు. విశేషంగా రాణిస్తున్నారు. అలాగే భారత్ లోని భౌగోళిక వాతావరణానికి, శ్రీలంకకూ పెద్ద తేడా ఏమీ ఉండదు. రెండూ ఆసియా ఖండంలోని ఇరుగుపొరుగు దేశాలే. ఆర్థిక పరిస్థితులూ, ప్రజల జీవన ప్రమాణాలూ ఒకలాంటివే. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో భౌగోళిక వాతావరణమూ, జీవన ప్రమాణాలూ మనతో పోలిస్తే తేడాగా ఉంటాయి కాబట్టి… ఆయా దేశాలకు చెందిన క్రికెటర్లు ఢిల్లీలో ఇబ్బందిపడితే అర్ధం చేసుకోవచ్చు కానీ… మనలాంటి దేశమే అయిన శ్రీలంకకు చెందిన క్రికెటర్లు ఇంతలా ఫీలవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మొదటి, రెండు టెస్టుల్లో అమోఘంగా రాణించిన భారత్ ను మూడో టెస్టులో ఆత్మరక్షణలోకి నెట్టి… ఆధిపత్యానికి గండికొట్టడానికే శ్రీలంక క్రికెటర్లు ఇలా ప్రవర్తిస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది. ఇలాంటి ప్రవర్తన కనబరిస్తే ఐపీఎల్ లో ఆడనివ్వబోమని బీసీసీఐ హెచ్చరిస్తే… లంకేయులు మారు మాట్లాడకుండా మ్యాచ్ ఆడతారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ విమర్శల గురించి తెలిసిందో, మరే కారణమో తెలియదు కానీ… నాలుగో రోజు ఆటలో పలువురు లంక క్రికెటర్లు మాస్క్ లు లేకుండానే ఆడుతున్నారు. 164 పరుగులు చేసిన చండీమల్ రెండు రోజుల పాటు మాస్క్ లేకుండానే ఆడగా… వికెట్ కీపర్ డిక్ వెల్లా సైతం ఎలాంటి మాస్క్ ధరించలేదు.