టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)కు రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ ఇస్తూ అక్కడి సంస్కృతిపై మాట్లాడుతూ నోరు జారాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్‌కేతోనే ఉన్న రైనాను తన సహచర కామెంటేటర్ చెన్నై సంస్కృతి గురించి అడిగాడు.
దీనిపై రైనా స్పందింస్తూ.. ” నేను కూడా బ్రాహ్మిణ్‌ను అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. అనిరుద్ధ శ్రీకాంత్, బద్రినాథ్, బాలాజీలతో కలిసి ఆడాను. ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. ఇక నా జట్టు సహచరులు అంటే చెప్పలేనంత అభిమానం. సీఎస్‌కే జట్టులో మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది.. అది ఎంతలా అంటే మాకు చాలా స్వేచ్చ దొరుకుతుంది. సీఎస్‌కే జట్టులో భాగం కావడం సంతోషంగా ఉంది ” అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రైనా చేసిన కామెంట్స్ దుమారాన్ని లేపాయి. చెన్నై అంటే కేవలం బ్రాహ్మిణ్‌లే ఉంటారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ” రైనా ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలి. ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నావు.. నువ్వు నిజమైన చెన్నై సంస్కృతిని చూసినట్లు లేవు” అంటూ మండిపడుతున్నారు.
ప్రస్తుతం రైనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఈ సీజన్‌కు మాత్రం సీఎస్‌కే తరపున ఆడాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు చేశాడు. గతేడాది ఫేలవ ప్రదర్శన కనబరిచిన సీఎస్‌కే ఈసారి మాత్రం దుమ్మురేపింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక సురేశ్ రైనా 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.