Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హీరోలు, హీరోయిన్లపై తమ ఇష్టాన్ని కొందరు అభిమానులు కాళ్లు మొక్కడం ద్వారా ప్రదర్శిస్తుంటారు. అయితే హీరోలంతా అలా అభిమానులు కాళ్లు మొక్కినప్పుడు కాస్త ఇబ్బంది పడి, పక్కకు జరగడమో లేదంటే వాళ్లను పైకి లేపడమో చేస్తుంటారు. తమిళ హీరో సూర్య మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. సూర్య తాజా చిత్రం గ్యాంగ్ తమిళ ప్రీ రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో భాగంగా సూర్య స్టేజ్ పై నిల్చోగానే అభిమానులు కూడా అక్కడకు వచ్చారు. వచ్చిన వెంటనే తమ అభిమాన హీరో కాళ్లకు వంగి నమస్కరించారు. దీంతో ఇబ్బందిపడిన సూర్య వెంటనే మరేమీ ఆలోచించకుండా తాను కూడా వారి కాళ్లకు దండం పెట్టాడు. ఇది చూసి అక్కడివారు షాకయ్యారు. ఈ దృశ్యాన్ని కొందరు అభిమానులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.
నిజానికి ఇతర భాషల హీరోలతో పోలిస్తే తమిళ హీరోలు అభిమానులతో చాలా ఆపేక్షగా ఉంటారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా సూర్యకు ఎదురయినలాంటి అనుభవమే కలిగింది. ఆయన స్టేజ్ మీదకు రాగానే అభిమానులు ఆయన కాళ్లకు నమస్కరించేందుకు అక్కడకు దూసుకెళ్లారు. అప్పుడు రజనీ చిరాకుపడకుండా… అభిమానులకు హితవచనాలు చెప్పారు. ఇలా పరాయి వ్యక్తి కాళ్లకు దండంపెట్టకూడదని, కేవలం దేవుడు, తల్లిదండ్రుల కాళ్లకు మాత్రమే నమస్కరించాలని తెలిపారు. అలాగే ఇటీవల సూర్య తమ్ముడు కార్తీ ఓ అభిమాని అంత్యక్రియలకు హాజరై ఏడవడం చూస్తే తమిళ హీరోలు తమ అభిమానులకు ఎంత విలువిస్తారో అర్ధమవుతోంది. కార్తీ ఓ అభిమానం కోసం ఏడవడం, సూర్య అభిమానుల కాళ్లకు మొక్కడం చూసి నెటిజన్లు ఈ అన్నాదమ్ముళ్ల మంచిమనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు