Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోక్ సభలో మళ్లీ అదే తంతు. టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాసతీర్మానాలపై చర్చ జరగకుండానే లోక్ సభ రేపటికి వాయిదా పడింది. ఎప్పటిలానే టీఆర్ఎస్, అన్నాడీఎంకె… బీజేపీ వ్యూహం ప్రకారం సభ జరగకుండా తమ వంతు పాత్ర పోషించాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే రోజూలానే టీఆర్ ఎస్, అన్నాడీఎంకె సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా సభ్యుల ఆందోళన కొనసాగింది. చేసేదేమీ లేక ఎంపీల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం ఇరాక్ లో 39 మంది భారతీయుల హత్యకు సంబంధించి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన చేశారు. అన్నాడీఎంకె, టీఆర్ ఎస్ సభ్యుల నినాదాల మధ్యే సుష్మ ప్రకటన సాగింది. ఇరాక్ లో నిర్బంధానికి గురైన 39 మంది భారతీయలు హత్యకు గురయ్యారని ప్రకటించేందుకు చింతిస్తున్నానని సుష్మ చెప్పారు.
వారు చనిపోయినట్టు ఆధారాలు లేకుండా ప్రకటించలేమని గతంలో సభలో పేర్కొన్నామని, ఆధారాలు లేకుండా ప్రకటిస్తే అదిపెద్ద పాపం అవుతుందని, ఆధారాలు ఉన్నందునే ఇప్పుడు ప్రకటిస్తున్నానని సుష్మాస్వరాజ్ తెలిపారు. సుష్మ ప్రకటన అనంతరం టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వా సతీర్మానాలను స్పీకర్ సభలో చదివి వినిపించారు. అవిశ్వాస తీర్మానాలకు మద్దతుగా సభ్యులు లేచి నిలబడేందుకు అవకాశం ఇవ్వాలని అన్నాడీఎంకె, టీఆర్ ఎస్ ఎంపీలను స్పీకర్ కోరారు. సభ సజావుగా సాగితే అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టవచ్చవని ఎంత చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఎంపీలంతా ఎవరి స్థానాల్లో కూర్చోవాలని, శాంతియుతంగా ఉండాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో సభను రేపటికి వాయిదావేస్తున్నట్టు సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
అటు బీజేపీ తీరుపై అన్ని పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభలో మెజార్టీ ఉన్నప్పటికీ అవిశ్వాసతీర్మానాన్ని ప్రభుత్వం వ్యూహం ప్రకారం చర్చకు రాకుండా అడ్డుకుంటోందని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. అవిశ్వాసతీర్మానంపై చర్చ జరిగితే… ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయని కేంద్రం భయపడుతోందని మండిపడుతున్నారు. టీఆర్ఎస్, అన్నాడీఎంకె ల ఎంపీలు బీజేపీ వ్యూహం ప్రకారమే సభను అడ్డుకుంటున్నాయన్న వాదనవినపడుతోంది.