Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో హిందూ జనాభా తగ్గిపోతూ ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలన్న నిబంధనను తొలగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇటీవలే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. హిందువుల సంఖ్య తగ్గుతూ ముస్లింల సంఖ్య పెరగడం దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కుటుంబ నియంత్రణ అన్ని మతాల వారికీ అమలు చేయాలని సూచించారు. తాజాగా హిందూ ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కర్నాటకలోని ఉడిపిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ సంసద్ జరుగుతోంది. సుమారు 2వేల మంది ఆధ్యాత్మిక వేత్తలు హాజరైన ధర్మసంసద్ లో మాట్లాడుతూ హరిద్వార్ పీఠాధిపతి స్వామీ గోవింద్ దేవ్ గిరిరాజ్ మహారాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరు పిల్లల విధానం వల్ల దేశంలో హిందూ జనాభా తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలన్న నిబంధన కేవలం హిందువులకు మాత్రమే వర్తింపజేయడం తగదన్నారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చేంతవరకు హిందువులు కనీసం నలుగురు పిల్లల్ని కనాలని సంచలనాత్మక సూచన చేశారు. అలా చేస్తేనే జనాభాను సమతౌల్యంగా ఉంచొచ్చని తెలిపారు. దేశంలో హిందువుల జనాభా తగ్గిన చోట …ఆయా భూభాగాలను భారత్ కోల్పోయిందన్నారు. మొత్తానికి అసలే అధిక జనాభాతో భారత్ సతమతమవుతోంటే కొందరు నేతలు, హిందూ ధార్మిక వేత్తలు ఎక్కువమంది పిల్లల్ని కనాలని ప్రచారం చేయడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి బదులు ప్రస్తుతం హిందువులు మాత్రమే పాటిస్తున్న కుటుంబ నియంత్రణను అన్ని మతాల వారికీ తప్పనిసరి చేస్తూ ఓ చట్టం చేస్తే జనాభా పెరగకుండా ఉండడంతో పాటు…సమతౌల్యతా ఏర్పడుతుంది.