ఆసక్తి రేపుతున్న తెలంగాణ బీజేపీ రాజకీయం !

Swami Paripoornananda Got Invitation From Amit shah

శ్రీరాముడిపై ఫిలిం క్రిటిక్ మహేశ్ కత్తి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి పాదయాత్రకు సిద్దమై హైదరాబాద్ నగర బహిష్కరణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. పరిపూర్ణానందకు బీజేపీ అండగా నిలిచింది. దీంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
మరోవైపు, పరిపూర్ణానందను ఆరు నెలలపాటు నగరం నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న పోలీసులకు హైకోర్టు షాకిచ్చింది. స్వామీజీపై నగర బహిష్కరణను హైకోర్టు ఎత్తివేయడంతో కిందటి నెల ఆయన హైదరాబాద్ వచ్చారు. అయితే అప్పటి నుంచి ఓ ప్రచారం ఊపందుకుంది. పరిపూర్ణానంద బీజేపీలో చేరుతున్నారని, తెలంగాణకు ఆయన మరో యోగి ఆదిత్యనాథ్ కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు సూచన ప్రాయంగా చెప్పారు. కానీ ఏ పార్టీలో చేరతారనేది స్పష్టంగా చెప్పలేదు. అయితే తాజాగా ఆయనకు బీజేపీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.

Swami Paripoornananda

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పరిపూర్ణానందస్వామి సోమవారం భేటీ కానున్నారని సమాచారం. పరిపూర్ణానంద స్వామికి అమిత్‌ షా వద్దనుంచి పిలుపు రావడంతో ఆయన ఆదివారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో స్వామి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం జరిగే భేటీలో అమిత్ షా స్వామిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించవచ్చని తెలుస్తోంది.