ఒడిశా ఘోరం జరిగింది. రాష్ట్రంలోని ఢెంకనాల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం గోవిందపూర్ గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
కాగా గోవిందపూర్ గ్రామానికి చెందిన జితేంద్రకుమార్ బెహర తన ఇద్దరు సోదరుల కుటుంబాలతో కలసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ ముగ్గురు అన్నదమ్ములకు చెందిన పిల్లలు నిషాల్, రాజేష్, ప్రీతిబాల, తృప్తిమయ సోమవారం ఉదయం ఇంట్లో కాసేపు చదువుకుని ఆ తర్వాత గ్రామ శివారులోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ఇక అలా వెళ్లిన పిల్లలు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు వారి కోసం చెరువు వద్దకు వెళ్లి గాలించారు. పిల్లల ఆచూకీ లభించక పోవడంతో తిరిగి వెళ్తున్న సమయంలో చెరువులో ఓ బాలిక మృతదేహం తేలుతూ కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు గ్రామస్థుల సాయంతో చెరువులో గాలిస్తే.. ఆ నలుగురు చిన్నారులు విగత జీవులుగా కనిపించారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.