మెగా స్టార్ ‘సైరా నరసింహా రెడ్డి’ రివ్యూ

మెగా స్టార్ 'సైరా నరసింహా రెడ్డి' రివ్యూ

సినిమా కథ ఝాన్సీలో మొదలవుతుంది. 1857 సిఫాయిలు తిరుగుబాటులో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి సారథ్యంలో బ్రిటిషర్లపై పోరాడారు. అయితే, వేలమంది చనిపోవడంతో లక్ష్మీబాయి సైన్యంలో ఉన్న కొందరు భయపడతారు. తిరుబాటును వదిలి పెట్టి ప్రాణాలు నిలుపుకోవాలని అనుకుంటారు. ఆ సమయంలో వాళ్లలో పౌరుషాన్ని నింపడానికి రేనాటి సూర్యుడు నరసింహారెడ్డి వీరగాథను వాళ్లకు చెబుతుంది లక్ష్మీబాయి. సరిగ్గా అప్పటికి పదేళ్ల క్రితం రేనాడు ప్రాంతంలోని నొస్సం పాలెగాడు మజ్జారి నరసింహారెడ్డి బ్రిటిషర్లపై ఎలా పోరాడాడు, ఆ ప్రాంతంలోని మిగిలిన పాలెగాళ్లను ఒక తాటిపైకి ఎలా తీసుకొచ్చాడు, ఆ పోరాటంలో తన ప్రాణాలను ఎలా త్యాగం చేశాడు వంటి విషయాలు వివరిస్తుంది. ఇదే ఈ చిత్ర కథ.

సైరాలో చిరు కన్నా ఉయ్యాలవాడ నరసింహారెడ్డే కనిపించాడు. ఇమేజ్‌ జోలికి పోకుండా పాత్రలో ఉన్నగంభీరం ఎక్కడా మిస్‌ కాకుండా చిరంజీవీ అద్భుతంగా నటించారు. యాక్షన్‌ సీన్స్‌లో అయితే మెగాస్టార్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సినిమా అంతా భారీ తారాగణంతో, ప్రతీ సీన్‌ నిండుగా ఉన్నా.. కళ్లన్నీ నరసింహారెడ్డి మీదే ఉండేలా నటించారు. సినిమా అంతా తన భుజాలమీదే మోశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే సీన్స్లో చిరు యాక్షన్ అదుర్స్ అనిపిస్తుంది. వావ్‌ అనిపించే పోరాట సన్నివేశాలను కూడా అవలీలగా చేసేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఈ సినిమా రూపురేఖలే మారిపోయాయి. ఉయ్యాలవాడ కారెక్టర్‌ను సురేందర్ రెడ్డి బిల్డప్ చేసిన తీరు అద్భుతంగా ఉందని.. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి సినిమా రేంజ్ మారిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఒక్కరూ తలెత్తుకునేలా చేసే సన్నివేశమది. “మరణం కాదు ఇది జననం”.. అంటూ చిరు పలికే సంభాషణలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.

చిరంజీవి తరువాత అంతగా పండిన పాత్ర అంటే అవుకు రాజు కిచ్చా సుదీప్‌దే. విభిన్న కోణాలను చూపిస్తూ.. అవసరమున్న చోట ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌కు గురి చేస్తారు. గురువు పాత్రలో గోసాయి వెంకన్నగా అమితాబ్‌ గౌరవ పాత్రలో నటించారు. కనిపించింది కొన్ని సీన్స్‌లోనైనా.. తెరపై అద్భుతంగా పడించారు. వీరా రెడ్డిగా జగపతి బాబు చక్కగా నటించాడు. క్లైమాక్స్‌లో జగపతి బాబు కంటతడి పెట్టిస్తాడు. విజయ్‌ సేతుపతి పాత్ర నిడివి తక్కువే అయినా రాజా పాండిగా నమ్మిన బంటు పాత్రలో ఒదిగిపోయాడు. సిద్దమ్మ పాత్రలో నయనతార.. కనిపించింది ఐదారు సీన్లే అయినా.. తన ముద్ర కనిపిస్తుంది. ఇక లక్ష్మీ పాత్రలో నటించిన తమన్నా అందర్నీ ఆకట్టుకుంటుంది. తన పాత్ర ముగింపు సినిమాను మలుపు తిప్పుతుంది. ఇక రవికిషన్‌, బ్రహ్మాజి, అనుష్క, ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.

“ద్వేషం కోసం కాదు దేశం కోసం నిలబడు” లాంటి ఎన్నో అద్భుతమైన, అర్థవంతమైన మాటలను సాయి మాధవ్‌ బుర్రా  రాశాడు.  సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. అమిత్‌ త్రివేది అందించిన పాటలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఉన్నవి రెండు పాటలే అయినా.. వాటిని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ముగ్దులు కావాల్సిందే. సైరా క్యారెక్టర్‌ అంతగా ఎలివేట్‌ అయిందంటే.. ప్రతీ సీన్‌తో ప్రేక్షకులు ఎమోషన్‌గా కనెక్ట్‌ అయ్యారంటే జూలియస్‌ ప్యాకియమ్‌ అందించిన నేపథ్య సంగీతమే అందుకు కారణం. రత్నవేలు పడిన కష్టం తెరపై కనిపిస్తుంది.