Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సంకుల సమరం జరుగుతుంది. తెలంగాణ అందుకు భిన్నం అని ఇన్నాళ్లు అనుకున్న మాటల్లో నిజం లేదని తేలే రోజులు వస్తున్నాయి. ఎప్పుడైతే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ఆ పార్టీని వీడడానికి డిసైడ్ అయ్యాడో అప్పుడే సీన్ మొత్తం మారిపోయింది. అంతకుముందు దాకా టి జాక్ ప్రెసిడెంట్ కోదండరాం కూడా కెసిఆర్ సర్కార్ మీద యుద్ధం చేస్తుంటే అందులో కుల కోణం ఉందన్న వాదనలు వినిపించినా వ్యవహారం పూర్తిగా బయటపడలేదు. కానీ రేవంత్ కాంగ్రెస్ లో చేరుతున్నాడు అన్న వార్తలు పుట్టగానే మ్యాటర్ మారిపోయింది. తెలంగాణ రాజకీయాల్లో కుల ప్రస్తావన పెరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒకరిద్దరు ఈ అంశాన్ని రేపైనా అప్పుడున్న సెంటి మెంట్ ముందు కులం నిలబడలేకపోయింది.
అయితే కెసిఆర్ అధికారంలోకి వచ్చాక అధికారానికి దూరం అయ్యామన్న ఆక్రోశం రెడ్లలో బాగా కనిపిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా దెబ్బ తింటున్న కాంగ్రెస్ నేతృత్వంలో ఎక్కువమంది ఆ కుల నేతలు ఉండటంతో వాళ్ళు సర్కార్ మీద ఉధృతంగా పోరాటాలు చేయలేకపోయారు. అయితే ఎన్నికల ఏడాది వచ్చే కొద్దీ కెసిఆర్ కి వ్యతిరేకంగా రెడ్లలో ఓ రకమైన ఐక్యత కనిపిస్తోంది. దూకుడుగా పోరాడితే అధికారం తిరిగి కైవసం చేసుకుంటామన్న ఆశ వారిలో వుంది. అందుకు కాంగ్రెస్ సరైన వేదిక అని వివిధ పార్టీల్లోని రెడ్డి నేతలు భావిస్తున్న మాట నిజం.
పరిస్థితి ఇంత హాట్ గా వున్నప్పుడే టి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నేరుగా కుల ప్రస్తావన తెచ్చారు. తెలంగాణాలో రెడ్డి కులస్తులంతా ఏకమై కెసిఆర్ కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని టి కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదాలో జగ్గారెడ్డి ఓపెన్ అయిపోయారు. రాజకీయంగా రెడ్లని అణగదొక్కడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. కోదండరాం, ఉత్తమ్ మీద కెసిఆర్ వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణాలో రెడ్లకి ఎస్సీ, బీసీ లతో మంచి సంబంధాలు ఉన్నాయని వెలమల పరిస్థితి అది కాదని జగ్గారెడ్డి నేరుగా మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల నేపథ్యంలో కులం పెద్ద ఎత్తున ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. అయితే కెసిఆర్ లాంటి వ్యూహకర్తని అంత తేలిగ్గా అంచనా వేయకూడదు. ఆయన ఈ ఎత్తుకి ఎలాంటి పై ఎత్తు వేస్తారో అన్నదాన్ని బట్టి ఈ వ్యవహారం ఎందాకా వెళుతుందో అర్ధం అవుతుంది.