అజ్ఞాతవాసి సినిమా విడుదల సమయం వచ్చేసరికి జోరుగా సాగిన ప్రచారం ఎప్పుడో వచ్చిన ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ ని కాపీ కొట్టారని. లార్గో వించ్ నుంచి ఇండియాకి సంబంధించి రీమేక్ రైట్స్ కొనుక్కున్న టీ సిరీస్ సంస్థ అజ్ఞాతవాసి నిర్మాతల నుంచి భారీగా పరిహారం పొందిందని తెలుస్తోంది. ఏ అనుమతి లేకుండా లార్గో వించ్ లో సీన్స్ ని అజ్ఞాతవాసికి వాడుకోవడం వల్లే టీ సిరీస్ కి ఇలా పరిహారం చెల్లించాల్సి వచ్చిందట. అయితే ఆ పరిహారం ఎంతన్న దానిపై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. కొందరు అజ్ఞాతవాసి డైరెక్టర్ త్రివిక్రమ్ ఓ కోటి కట్టి ఈ సమస్య నుంచి బయటపడ్డారు అని చెబుతుంటే ఇంకొందరు ఆ అమౌంట్ పది కోట్లు పై మాటే అంటున్నారు. నిజానికి టీ సిరీస్ కి అజ్ఞాతవాసి నుంచి దక్కింది కోటికి కాస్త అటుఇటుగా అని తెలుస్తోంది.
టీ సిరీస్ కి అజ్ఞాతవాసి నుంచి ఎంత దక్కినా అంతకు మించిన నష్టం వారికి వేరే విధంగా తగిలింది. కొద్దిపాటి పెట్టుబడితో భారీగా ఆర్జిస్తున్న టీ సిరీస్ బిజినెస్ టెక్నిక్ బయటపడింది. లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమా నిజానికి 2008 లో విడుదల అయ్యింది. దానికి సీక్వెల్ కూడా వచ్చింది. ఎప్పుడో ఏడెనిమిది ఏళ్ళ కిందట విడుదల అయిన సినిమా రైట్స్ ని చౌకగా అంటే లక్షల రూపాయలకి కొన్న టీ సిరీస్ ఆ సినిమాకి కాపీ అన్న కారణంతో అజ్ఞాతవాసి నుంచి కోటి దాకా వసూలు చేసింది. ఇలాగే ఇంకొన్ని సినిమాల రైట్స్ కొన్న ఆ సంస్థ ఇప్పుడు నిర్మాణంలో వున్న మరికొన్ని భారీ సినిమాలకు కూడా నోటీసు లు ఇచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద కష్టం, పెట్టుబడి లేకుండా టీ సిరీస్ చేస్తున్న ఈ బిజినెస్ మీద అజ్ఞాతవాసి ఎపిసోడ్ తో కొందరు తెలుగు మేకర్స్ దృష్టి పడిందట. అంటే విదేశీ సినిమా కధలు ఇక తెలుగులో తామరతంపరగా వస్తాయేమో. పక్క రాష్ట్రాల్లో హిట్ అయిన సినిమాలకు కోట్లు పోసి కొనేకంటే అంతర్జాతీయ స్థాయి సబ్జక్ట్స్ కి లక్షలు వెచ్చించి కొనుక్కోవడం మేలు అన్న సత్యాన్ని తెలుగు ప్రొడ్యూసర్స్ కి ఫైన్ కట్టించుకుని మరీ నేర్పించిన టీ సిరీస్ వారికి థాంక్స్ చెప్పాల్సిందే.