Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలపై తమిళ క్రికెట్ అభిమానులు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. కావేరీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలు… మంగళవారం చెన్నై, కోల్ కతా మ్యాచ్ ను అడ్డుకున్నారు. 4000 మంది పోలీసులతో చిదంబరం స్టేడియానికి భద్రత కల్పించినప్పటికీ… పలువురు ఆందోళనకారులు నిరసనలకు దిగారు. జెర్సీలు తగలబెట్టడంతో పాటు కొందరు నిరసనకారులు… స్టేడియంలోకి చెప్పులు కూడా విసిరారు. బౌండరీ లైన్ బయట ఉన్న డుప్లిసిస్, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా వాటిని బయటకు విసిరేశారు. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్ ల వేదికను కూడా చెన్నై నుంచి మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారుల తీరుపై తమిళనాడు క్రికెట్ అభిమానుల తరపున రచయిత, విశ్లేషకురాలు, ప్రముఖ నటి కస్తూరి శంకర్ క్షమాపణలు చెప్పారు. ఆందోళనకారులు విసిరిన చెప్పులను బయటపడేసిన డుప్లెసిస్, రవీంద్ర జడేజాలను ట్యాగ్ చేస్తూ క్షమించమని కోరారు. కస్తూరి ఈ ట్వీట్ చేసిన తర్వాత పలువురు అభిమానులు కూడా వారిని ట్యాగ్ చేస్తూ క్షమాపణలు చెప్పారు. మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. స్టేడియంలో జరిగిన ఘటనకు చింతిస్తున్నాం. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాం. మా గురించి తప్పుగా భావించొద్దు. మీరంటే మాకు అమితమైన గౌరవం ఉంది అని తమిళ అభిమానులు ట్వీట్లు చేశారు.
ఆందోళనకారుల తీరుపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు నిరసనకారులు ఓ పోలీసును కొడుతున్న వీడియోను షేర్ చేసిన రజనీ… ఇలాంటి ఆందోళనలు దేశానికి నష్టం కలిగిస్తాయన్నారు. పోలీసులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగానూ తమిళుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సమస్యతో ఏ మాత్రం సంబంధం లేని క్రికెట్ మ్యాచ్ లపై ఆందోళనకారులు తమ ప్రతాపాన్ని చూపించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలి కానీ… చెప్పులు విసరడం, జెర్సీలు తగలబెట్టడం, పోలీసులపై దాడకి దిగడం వంటి హింసాత్మక చర్యలు… పోరాటాన్ని పక్కదారి పట్టించే ప్రమాదముందన్న హెచ్చరికలూ వినిపించాయి. దీంతో… చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ తమిళులు క్షమాపణలు చెప్పారు.