ఒక సినిమా కధను తలపించేలా సినీ ఫక్కీలో ఒక ఎమ్మెల్యే పెళ్లి ఆగిపోయింది. మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఎమ్మెల్యే పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి తన లవర్ తో వెళ్లిపోవడంతో ముఖ్యమంత్రి సహా దాదాపు మంత్రివర్గాన్ని అంతా పిలిచిన ఎమ్మెల్యే పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే ఈరోడ్ జిల్లా భవానీ సాగర్ నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ (43), గోబిశెట్టిపాళయం సమీపంలోని ఉక్కరం ప్రాంతానికి చెందిన సంధ్యలకు (23) పెళ్లి కుదిరి తాజాగా నిశ్చితార్థం కూడా జరిగింది.
ఈ నెల 12న సత్యమంగళం సమీపంలోని బన్నారి అమ్మన్ ఆలయంలో వీరి వివాహం జరగాల్సి వుంది. వరుడు ఎమ్మెల్యే కావడంతో ఊరాంతా పెళ్లిపత్రికలు పంచిపెట్టి పెళ్లి ఏర్పాట్లలో తలమునకలయ్యారు ఇరు కుటుంబాల వారు. ఇంతలో ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు సంధ్య సత్యమంగళంలో ఉన్న తన సోదరిని చూసి సాయంత్రానికి తిరిగి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. అయితే ఆరోజు రాత్రి ఆమె ఇంటికి తిరిగి రాకపోవడం, ఆమె ఫోన్ కలవకపోవడంతో సత్యమంగళంలో ఉన్న సంధ్య సోదరికి ఫోన్ చేయగా ఆమె అసలు సత్యమంగళం వెళ్లలేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో తెలిదేమిటంటే ఈరోడ్ జిల్లా ఊత్తుకుళి ప్రాంతానికి చెందిన విగ్నేష్ అనే యువకుడి రెండేళ్లుగా ఆమె ప్రేమించిందని, ఈ విషయం తెలిసి అన్నాడీఎంకే శాసనసభ్యుడితో ఆమె పెళ్లి కుదిర్చినట్టు తెలిసింది. తనకిష్టంలేని పెళ్లి జరుగనుండటంతో సంధ్య తన ప్రేమికుడితో పారిపోయింది.