Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లైంగిక దాడులు, వేధింపులకు వ్యతిరేకంగా దేశమంతా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నవేళ..ఉన్నతస్థానాల్లో ఉన్న వ్యక్తులు వ్యవస్థపై నమ్మకం కలిగించేలా..హుందాతనంగా వ్యవహరించాలి. మహిళల భద్రతపై కలుగుతున్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేయాలి. కానీ అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులు కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ ప్రవర్తన ఇందుకు ఉదాహరణ. తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్న లైగింక వేధింపుల కేసులో గవర్నర్ పేరు వినిపించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి, ఓ విద్యార్థినిని లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తూ ఫోన్ లో మాట్లాడుతూ, తనకు గవర్నర్ తెలుసునని చెప్పడం సంచలనంగా మారింది.
ఈ ఫోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఖండించేందుకు గవర్నర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆమెతో తనకు సంబంధం లేదని చెప్పిన గవర్నర్ అనేక ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దాటవేశారు. ఆయన మీడియా సమావేశం ముగించుకుని వెళ్తుండగా ఓ మహిళా జర్నలిస్టు ఒక ప్రశ్నవేసింది. దానికి గవర్నర్ సమాధానం ఇవ్వకుండా ఆ మహిళా జర్నలిస్ట్ చెంప నిమిరారు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. గవర్నర్ స్థాయి వ్యక్తి ఇలా చేయడంపై తమిళనాట ఆగ్రహం వ్యక్తమవుతోంది. విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంప తాకారు అని మహిళా జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో వాపోయింది. గవర్నర్ మహిళా చెంపను తాకుతున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పలువురు భన్వరిలాల్ వైఖరిని తప్పుబడుతున్నారు.