Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ గవర్నర్ ఓ మహిళ స్నానం చేస్తుండగా చూశారంటూ తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. అటు ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఈ వార్తల్లో నిజంలేదని రాజ్ భవన్ వర్గాలు వివరణ ఇచ్చినప్పటికీ… వాటికి తెరపడలేదు. వివరాల్లోకి వెళ్తే… కడలూరు జిల్లాలో శుక్రవారం గవర్నర్ ఆకస్మిక తనిఖీలకు బయలుదేరి వెళ్లారు. వండిపాళయం వద్ద రోడ్డు పక్కనే ఓ కాలనీ కనిపించడంతో అక్కడి మరుగుదొడ్లను పరిశీలించారు. ఓ మరుగుదొడ్డి పక్కన తడికెలతో కట్టిన స్నానాల గదిలోకి కూడా ఆయన తొంగిచూశారు.
ఉద్దేశపూర్వకంగా కాకుండా తనిఖీల దృష్టితోనే ఆయన చూశారు. అయితే ఆ తడికెల మాటున స్నానం చేస్తున్న మహిళ కనిపించడంతో గవర్నర్ ఖంగుతిన్నారు. ఆ మహిళ కూడా గవర్నర్ ను చూసి భయపడిపోయి చీర కప్పుకుని గట్టిగా అరుచుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. గవర్నర్ మాత్రం వెంటనే అక్కడి నుంచి వెనుతిరిగినట్టు సమాచారం. తర్వాత ఈ విషయం మీడియాలో వచ్చింది. స్నానాల గదిలోకి గవర్నర్ తొంగిచూశారంటూ కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై రాజ్ భవన్ వర్గాలు వివరణ ఇచ్చాయి. స్నానాల గదిలో ఎవరూ లేరని మహిళా వీఆర్వో, కలెక్టర్లు చూసిన తర్వాతే గవర్నర్ అక్కడ తనిఖీ చేశారని తెలిపాయి. కొన్నివార్తలు ప్రసారం చేసే ముందు ఒకసారి సరిచూసుకోవాలని రాజ్ భవన్ వర్గాలు మీడియాను కోరాయి.