తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరోనా బారినపడ్డారు. కాస్త అలసటగా అనిపించిందని.. కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ అని తేలిందని ట్విటర్ ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. దీంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. ‘అందరూ మాస్కులు ధరించండి. వ్యాక్సిన్ వేసుకోండి. సేఫ్గా ఉండండి’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు. అంతకు కాసేపటి ముందే ఆయన మాస్కు లేకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో సీఎం స్టాలిన్ వెంట ఉన్న అధికారులు సైతం పరీక్షలు నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. తమిళనాడులో సోమవారం కొత్తగా 2,448 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క చెన్నై నగరంలోనే 796 కేసులు ఉన్నాయి.