ఒకప్పుడు తాప్సి పన్ను దక్షిణాదిన ఒక మీడియం రేంజ్ హీరోయిన్. ఎక్కువగా గ్లామర్ క్యారెక్టర్లు చేస్తూ నటిగా పెద్ద గుర్తింపేమీ లేకుండా ఏదో అలా కెరీర్‌ను నడిపిస్తూ వచ్చింది కొన్నేళ్లు. కానీ ఆమె ఏ ముహూర్తాన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో కానీ.. అక్కడి నుంచి దశ తిరిగిపోయింది. అక్కడ కొన్ని మంచి పాత్రలు పడటంతో తాప్సి కెరీరే మారిపోయింది.
ఈ రోజు కంగనా రనౌత్ తర్వాత నటిగా అంత మంచి గుర్తింపుతో, ప్రత్యేకమైన సినిమాలతో దూసుకెళ్తోంది తాప్సి. ఆమె సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే భరోసా ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటి కమర్షియల్ హీరోయిన్‌గానూ ఆమె ఒక స్థాయిని అందుకుంది. ఆమె పేరు మీద సినిమాకు రూ.50 కోట్ల దాకా ఈజీగా బిజినెస్ అయిపోతోంది.
తాప్సి బాక్సాఫీస్ సత్తా ఏంటనేది గత ఏడాది కాలంలో ఆమె నటించిన సినిమాల వసూళ్లు చూస్తే అర్థమవుతుంది. గత ఏడాది కాలంలో మరే హీరోయిన్ సినిమాలు సాధించని వసూళ్లు తాప్సి సినిమాలు సాధించాయి. ఆ మొత్తం రూ.352 కోట్లు కావడం ఆశ్చర్యం కలిగించే విషయం.
గత ఏడాది మార్చి 8న రిలీజైన తాప్సి సినిమా బద్లా రూ.88 కోట్లు వసూలు చేసింది. తర్వాత ఆమె నుంచి వచ్చిన తెలుగు-తమిళం ద్విభాషా చిత్రం రూ.రూ.4.7 కోట్లు రాబట్టింది. ఆపై తాప్సి ఒకానొక హీరోయిన్గా నటించిన మిషన్ మంగల్ రూ.203 కోట్లు కొల్లగొట్టింది. ఇక భూమి పడ్నేకర్‌తో తాప్సి స్క్రీన్ షేర్ చేసుకున్న శాండ్ కీ ఆంఖ్ రూ.23.4 కోట్లు రాబట్టింది.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న రిలీజైన తప్పడ్.. అన్ సీజన్లోనూ రూ.33. కోట్లు వసూలు చేసింది. ఇలా ఏడాది వ్యవధిలో తాప్సి నటించిన సినిమాలు రూ.352 కోట్లు వసూలు చేసి ఆమెను ఇండియన్ నంబర్ వన్ హీరోయిన్గా నిలబెట్టాయి.