తెలుగు సినిమాలపై సెటైర్ వేసిన తాప్సి

తెలుగు సినిమాలపై సెటైర్ వేసిన తాప్సి

దక్షిణాది సినిమాల్లో అవకాశాలు దక్కితే ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటారు ఉత్తరాది హీరోయిన్లు. ఇక్కడ పారితోషకాలు భారీగా దక్కుతాయి.ఎలా చేయమంటే అలా చేస్తారు. ఛాయిస్ తీసుకున్నది వాళ్లే కాబట్టి చేసే సినిమాల విషయంలో ఎప్పుడూ రిగ్రెట్ అవ్వకూడదు. సెటైర్లు వేయకూడదు. కానీ ఇలియానా, తాప్సి లాంటి వాళ్లకు ఇదేమీ పట్టదు. సౌత్‌లో, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో వీళ్లు చేసినవన్నీ గ్లామర్ రోల్సే. ఆ సమయానికి సంతోషంగా ఈ సినిమాలు చేసుకుపోయారు.

కానీ బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కొన్ని పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ దక్కి.. వాటిలో ప్రతిభ చాటుకుని పేరు సంపాదించేసరికి వీళ్ల ఆలోచనలు మారిపోయాయి.ఇప్పటికే పలుమార్లు సౌత్ సినిమాలపై సెటైర్లు వేసింది తాప్సి. బాలీవుడ్ మీడియాతో మాట్లాడినపుడల్లా సౌత్ ఫిలిం మేకర్ల తీరును తప్పుబట్టింది. తన ప్రతిభకు తగ్గ పాత్రలు ఇవ్వలేదంది. కానీ తాజాగా ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం తాప్సి స్వరం మార్చేసింది. వేరే వాళ్ల మాటలు విని తాను ఇక్కడ సినిమాల ఎంపికలో తప్పులు చేశానంది.

నా కెరీర్ ఆరంభంలో ఎలా నటించాలో, ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలో నాకు తెలియదు.నువ్వు ఈ సినిమా చేయాలి. ఈ పాత్ర చేయాలి. ప్రతి హీరోయిన్ చేస్తుంది. నువ్వూ చేస్తే పెద్ద హీరోయిన్ అవుతావు అని ఇతరులు చెప్పిన మాటలు నమ్మాను. వేరే హీరోయిన్లకు ఓకే కానీ.. నాకు అలాంటి సినిమాలు వర్కవుట్ కావని తెలుసుకున్నాను. నా సొంత బుర్ర ఉపయోగించి.. నాకు నేనుగా సినిమాలు ఎంచుకున్నాను. వేరే వాళ్ల మాటలు విని సినిమాలు చేయడమే నేను చేసిన తప్పు అని తాప్సి అంది.