టాటూలు వేయించుకోడానికి వచ్చిన మహిళలపై అత్యాచారం

టాటూలు వేయించుకోడానికి వచ్చిన మహిళలపై అత్యాచారం

తన వద్ద టాటూలు వేయించుకోడానికి వచ్చిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కేరళ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కోచికి చెందిన సుజీష్ అనే టూటూ ఆర్టిస్ట్‌ పై మార్చి 2న ఓ 18 ఏళ్ల యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. అతడి వద్ద టాటూ వేయించుకోడానికి వెళ్లిన సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన వెన్నెముకపై సూదితో టాటూ వేస్తూ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.

బాధితురాలు తన పోస్ట్‌లో ‘‘వారం రోజుల కిందట టాటూ వేయించుకునేందుకు స్టూడియోకు వెళ్లాను…. స్టూడియో రద్దీగా ఉండటంతో ప్రైవసీ కోసం ప్రయత్నించాను.. టాటూ వేయించుకుండగా ఆర్టిస్ట్ దానిని అనువుగా తీసుకుని అసభ్యంగా తాకాడు.. దీనికి తాను అభ్యంతరం చెప్పడంతో వెన్నెముకపై సూది పెట్టి పై అత్యాచారం చేశాడు’’ ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.

‘‘ఆ మనిషికి ఇలాంటి ధైర్యం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడు చాలా మూర్ఖంగా నా పట్ల వ్యవహరించడంతో నాకు అక్కడే చచ్చిపోవాలని అనిపించింది.. నేను అసహ్యంగా భావించాను’’ అని ఆమె తన గోడును వెల్లబోసుకుంది. బాధితురాలు తమకు ఫిర్యాదు చేయకపోయినా.. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.

పోస్ట్ వైరల్ అయిన తర్వాత మరికొంత మంది బాధితులు అతడి చేతిలో గత కొన్నేళ్లుగా అత్యాచారానికి గురైనట్టు బయటపెట్టారు. ఆదివారం ఉదయం నుంచి 164 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదుచేయడంతో పరారైన నిందితుడు సుజీష్.. నలువైపులా చుట్టిముట్టడంతో చివరకు లొంగిపోయాడు.

కోచి నగర కమిషనర్ సీహెచ్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఆదివారం ఉదయం ఫిర్యాదు వెల్లువెత్తాయి.. మొత్తం 164 మంది ఫిర్యాదు చేశారు.. ఇప్పటి వరకూ ఆరు కేసుల్లో నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశాం.. ఇవన్నీ నాన్-బెయిల్‌బుల్ కేసులు.. అన్ని వైపుల నుంచి పోలీసులు దిగ్బంధనం చేయడంతో నిందితుడు లొంగిపోయాడు’’ అని తెలిపారు.

‘‘ఇది ఒక్కసారి చేసిన ఫిర్యాదు కాదు.. మాకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంకా చాలా టాటూ స్టూడియోలు ఉన్నాయి. వాటిపై మాకు ఫిర్యాదులు రాలేదు. అన్ని ఫిర్యాదులు ఈ ఒక్క వ్యక్తిపైనే ఉన్నాయి.. ఫిర్యాదులు సంఘటనలకు సంబంధించినవే అయినప్పటికీ మౌఖిక సాక్ష్యాలతో సహా ఘటన తర్వాత బాధితులు సన్నిహితులైన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో వివరాలను పంచుకున్నారా? లేదా? అనేది విచారించాల్సి ఉంది.. ఎందుకంటే ఇదంతా నాలుగు గోడల మధ్య జరుగుతుంది’’ అని అన్నారు.

నిందితుడు ఆదివారం అర్ధరాత్రి తర్వాత లొంగిపోయాడని, అతడ్ని విచారణకు చేరనల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లామని తెలిపారు. విచారణలో మరిన్ని నిజాలు వెలుగుచూస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కోచిలో గత పదేళ్లుగా టూటూ స్టూడియో నిర్వహిస్తున్న సుజీష్.. టూటూలు వేయడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, అతడి స్నేహితులు, బంధువులు మాత్రం ఇవన్నీ ఆరోపణలేనని, స్టూడియోలో అందరూ చూస్తుండగానే టాటూలు వేస్తాడని, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని అంటున్నారు.