బీజేపీ, టీడీపీ బంధానికి నేడో, రేపో బ్రేక్ ?

TDP and BJP alliance may breaks today or tomorrow

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బీజేపీ, టీడీపీ బంధం బీటలు వారుతుందా, కొనసాగుతుందా అన్నది నేడో, రేపో తేలిపోనుంది. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు రెండు పార్టీలు విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. నేడు టీడీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అమరావతిలో జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో అనుసరించాల్సిన వ్యూహం, బీజేపీ తో పొత్తు వంటి అంశాల మీద చంద్రబాబు పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా విభజన చట్టంలో హామీలు అన్ని నెరవేర్చేదాకా పోరాటం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో రెండో ఆలోచన లేదని ఆయన కుండబద్ధలు కొడుతున్నారు. హోదా కి బదులు ప్రకటించిన ప్యాకేజ్ ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే చాలని ఆయన భావిస్తున్నారు. అయితే హోదా విషయంలో వైసీపీ, జనసేన, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారం చూసి బాబు కాస్త సంయమనం పాటిస్తున్నారు. విభజన హామీలు విషయంలో రాజీపడితే రాజకీయ భవిష్యత్ ఉండదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఆ విషయంలో రాజీపడకూడని నిర్ణయం తీసేసుకున్నారు. దీంతో బీజేపీ స్పందన మీదే టీడీపీ ప్రతిస్పందన ఆధారపడి వుంది.

ఇక బీజేపీ కూడా విశాఖ వేదికగా ఓ కీలక సమావేశం ఏర్పాటు చేసుకుంది. 2014 ముందు rss ప్రతినిధిగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన సతీష్ జీ ఇప్పుడు బీజేపీ నేత హోదాలో అధిష్టానం తరపున ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశంలో టీడీపీ పొత్తు, విభజన హామీల మీద కేంద్రం తీసుకున్న చర్యల గురించి క్షుణ్ణంగా చర్చించబోతున్నారు. టీడీపీ డిమాండ్స్ తీర్చడం కష్టమని అటు కేంద్రం కూడా గట్టిగానే భావిస్తున్న తరుణంలో ఈ భేటీ కీలకం కానుంది. మార్చి 5 న రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగే లోపు రెండు పార్టీలు పొత్తుల మీద ఓ నిర్ణయానికి వచ్చి అందుకు అనుగుణంగానే తదుపరి వ్యూహాలు అమలు చేసే అవకాశం వుంది.