ఎన్టీఆర్ తెలుగుదేశం విలువలను చంద్రబాబు తుంగలో తొక్కినట్టేనా…?

TDP-Chief-Chandrababu-Naidu

నిన్న గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ని కలిసి, స్నేహహస్తం చాచిన చంద్రబాబు నాయుడు వైఖరిని చూశాక ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమాని అనుకుంటున్న విషయం “తెలుగువారి ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ విలువలను తుంగలో తొక్కి, 36 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అగ్ర ప్రత్యర్థిగా ఉంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతిష్టని ఒకే ఒక్క కరచాలనం తో మంటగలిపారని”. దీని దృష్ట్యా, రాజకీయాల్లో శాశ్వత ప్రత్యర్ధులు, మిత్రులు అంటూ ఎవరూ ఉండరని, అవసరాలకనుగుణంగా అడుగులు మారుస్తారని మరోసారి ఋజువయ్యింది.

cm-eith-rahulgandi

ఇదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా బీజేపీ-ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలన విదేశీ పాలన అని, సోనియా గాంధీ అవినీతి అనకొండ అని, ఇటలీ మాఫియా అని, సోనియా గాంధీ కాదు సోనియా గాడ్సే అంటూ అనేక విమర్శలు చేశారు.ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హొదా కల్పించే విషయంలో చిన్న చూపు చూస్తూ, అన్యాయం చేశారని బీజేపీ పై నిరసన దీక్ష తో తన వ్యతిరేకతని ప్రదర్శించారు. ఇకపై బీజేపీ తో కలిసి నడవడం వీలు కాదని, ఢిల్లీలో రాహుల్ గాంధీ ని కలిసి, కాంగ్రెస్ తో కలిసి నడవడంకి సుముఖత వ్యక్తం చేశారు.

cm-chandrabau-and-rahul-mee

ఇది రాబోతున్న ఎన్నికల్లో సీట్లకోసమో, అధికారం కోసమో తీసుకున్న నిర్ణయం కాదని, బీజేపీ నుండి దేశ ప్రజాసామ్యని రక్షించాలనే తాపత్రయం అని తెలిపిన చంద్రబాబు నాయుడు మీద విమర్శలు అన్ని శ్రేణుల నుండి ఎదురవుతున్నాయి. కానీ, దేశంలో తాము అధికారం లోకి రాగానే, చేసే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హొదా మీదే అని తెలిపిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలకి ఇంత త్వరగా చంద్రబాబు నాయుడు ప్రభావితం కావడం నమ్మశక్యంగా లేని విషయంగా తెలుగుదేశం అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గడిచిన 36 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కి అగ్ర ప్రత్యర్థిగా కీర్తించబడుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మిత్రపక్షం గా మారడాన్ని తెలుగు ప్రజలు ఏవిధంగా తీసుకుంటారో అనేది వేచి చూడాల్సిన విషయం.

telugu-desam