Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావి శోభనాద్రి చౌదరి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారని సమాచారం. ఇప్పుడు ఆయన వయసు 96 సంవత్సరాలు. వృద్ధాప్య కారణాలతో ఆయన సహజ మరణం పొందినట్టు కుటుంబీకులు ప్రకటించారు. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరిన రావి శోభనాద్రి చౌదరి గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. అలాగే 25ఏళ్ల పాటు గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేశారు. అంతేగాక రాష్ట్ర ఫెనాన్స్ కార్పొరేషన్ డెరెక్టర్‌గా ఐదు సంవత్సరాలు పనిచేశారు.
ముందు నుండి ఆయన కుటుంబానికి గుడివాడ ప్రాంతంలో మంచి పట్టుంది. రావి శోభనాద్రి చౌదరి కుమారుడు రావి వెంకటేశ్వరరావు ప్రస్తుతం గుడివాడ రాజకీయాల్లో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టికెట్ పొంది అప్పటి తెలుగుదేశం అభ్యర్ధి కోడలి నాని మీద ఓడిపోయిన ఆయన. తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొడాలి వెంకటేశ్వరరావు పై తెలుగుదేశం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
శోభనాద్రి చౌదరి పెద్ద కుమారుడు 1999లో గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచి, ఆపై రోడ్డు ప్రమాదంలో మరణించగా, 2000లో జరిగిన ఉప ఎన్నికలతో వెంకటేశ్వరావు రాజకీయాల్లోకి వచ్చారు. కాగా, రావి శోభనాద్రి చౌదరి మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు… శోభనాద్రి మృతివార్త తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారని సమాచారం. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న ఆయన మృతి టీడీపీకి తీరని లోటని అన్నారు. రావి శోభనాద్రిచౌదరి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.