ఆ అనుభ‌వంతోనే ఇలా చేస్తున్నా…. చంద్రబాబు

Chandrababu speech in Hindustan Times leadership summit

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సైబ‌రాబాద్ వంటి ఆధునిక న‌గ‌రాన్ని నిర్మించిన అనుభ‌వంతో అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. ఒక‌రోజు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి హిందుస్థాన్ టైమ్స్ – మింట్ ఆసియా లీడ‌ర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా సింగ‌పూర్ ను ప‌రిశీలిస్తున్నాన‌ని, వారు వేగంగా ముంద‌డుగు వేయ‌గ‌లిగార‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త‌గా ఏర్ప‌డింద‌ని, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్ర‌మ‌ని, రాజ‌ధాని లేక‌పోవ‌డం అన్నింటిక‌న్నా పెద్ద సంక్షోభ‌మ‌ని చంద్ర‌బాబు చెప్పారు. సైబ‌రాబాద్ ను నిర్మించిన అనుభ‌వం, బ్రౌన్ ఫీల్డ్ సిటీగా హైద‌రాబాద్ ను తీర్చిదిద్ద‌డం త‌న‌కు అమరావతి నిర్మాణంలో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని చెప్పారు. విశాల‌మైన ర‌హ‌దారులు, భూగ‌ర్భ జ‌ల వ్య‌వ‌స్థ‌, మురుగునీటిపారుద‌ల వ్య‌వ‌స్థ‌, వ‌ర‌ద నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ త‌దిత‌ర ఏర్పాట్ల‌న్నీ ఒక్కొక్క‌టీ పూర్తిచేస్తూ వ‌స్తున్నామ‌న్నారు.

ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ క‌న్స‌ల్టెంట్ల‌ను నియ‌మించుకుని రాజ‌ధాని ప్ర‌ణాళిక‌లు, ఆకృతులు రూపొందించుకుంటున్న‌ట్టు ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. కొత్త రాజధానికి భూమిని స‌మ‌కూర్చుకోవ‌డం పెద్ద స‌వాల్ గా మారింద‌ని, రాజ‌ధానికి కావాల్సిన భూమిని స‌మ‌కూర్చుకునేందుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర లేద‌ని, అలాంటి ప‌రిస్థితుల్లో ఒక్క పిలుపు నిస్తే రాజ‌ధాని రైతులు స్పందించార‌ని చంద్ర‌బాబు తెలిపారు. సింగపూర్ త‌ర‌హా న‌గ‌రాన్ని నిర్మిస్తామ‌ని ఎంతో న‌మ్మ‌కంగా చెప్ప‌డంతో 33వేల ఎక‌రాల విలువైన భూముల‌ను రైతులు ఇచ్చార‌ని, రాజ‌ధాని నిర్మాణం కోసం మాస్ట‌ర్ ప్లాన్ ను సింగ‌పూర్ ప్ర‌భుత్వాన్ని కోర‌గా..ఆరు నెల‌ల్లో సిద్ధం చేసి ఇచ్చార‌ని చంద్ర‌బాబు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. స‌ద‌స్సులో హిందుస్థాన్ టైమ్స్ ఎడిట‌ర్ ఆర్. సుకుమార్ ప్రారంభోప‌న్యాసం చేశారు. చంద్ర‌బాబును స‌ద‌స్సుకు ప‌రిచ‌యం చేస్తూ సంస్క‌ర‌ణ వాది..పాల‌న‌లో ఆధునిక సాంకేతిక‌త‌ను ప్ర‌వేశ‌పెట్టిన ముఖ్య‌మంత్రిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.